Avoid snacks
చిరుతిండ్లను మానండి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
కాలక్షేపానికి తినే తిండిని చిరుతిండి అంటారు. మన పెద్దవాళ్ళకు ఎక్కువ డబ్బులేక, ఒకవేళ డబ్బు ఉన్నా వాటిని వండుకోవాలంటే తీరిక లేకో లేదా పోటు వేసి పిండికొట్టి, దాన్ని జల్లించి, కట్టె పుల్లల పొయ్యిమీద ఎంతో కష్టంతో వండే ఓపిక లేకో మొత్తానికి సందర్భం లేకుండా వండేవారు కాదు. చిరుతిండ్లను వండాలంటే పండగన్నా లేదా శుభకార్యమన్నా ఉంటే తప్ప వండేవారు కాదు. తింటే ఆ 2, 3 రోజులు ఆపు లేకుండా మొహం మొత్తేవరకు తిని మళ్ళీ వాటి సంగతి మరిచిపోయేవారు. అది వాళ్ళకు అదృష్టంగా కలసి వచ్చింది. వారు మిగతా రోజులలో భోజనం తరువాత సాయంత్రం లోపు ఆకాలంలో దొరికే ఈతపండ్లు, రేగిపండ్లు, తాటిపండ్లు, సీమ చింతకాయలు, ముంజెలు, తేగలు, బుర్రగుంజు మొదలైన ప్రకృతిసిద్ధమైన చక్కని చిరుతిండ్లను తినేవారు. పిల్లలకు వేపుడు శెనగలు, వేరు శెనగపప్పులు, బఠాణీలు, మరమరాలు, మామిడితాండ్ర, తాటితాండ్ర లాంటి చిరుతిండ్లు కొనిపెడుతూ ఉండేవారు. ఇవి కాకుండా ఏ పండు దొరికితే ఆ పండు తినేవారు. రోజూ గంజి అన్నం, మజ్జిగన్నం తిన్నా
అందులో లోపించిన పోషక విలువలు వారు తినే చిరుతిండ్ల ద్వారా శరీరానికి అందేవి. అందుచేతనే మన పెద్దలకు అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండేవి. కనీసం 50, 60 సం॥లు వచ్చే వరకన్నా రోగం రాకుండా, మూలపడకుండా, మందుబిళ్ళ మ్రింగకుండా జీవించగలిగారు. కంటి చూపు పోవడంగానీ, పళ్ళు ఊడిపోవడం గానీ, బహిస్టులకు సంబంధించిన సమస్యలు కానీ, బి.పి. సుగర్ల గానీ, వయస్సులో ఉన్నప్పుడు కీళ్ళనొప్పులు గానీ, తెల్లజుట్టుగానీ వచ్చేవి కాదు. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళను అలా రక్షించాయి.
ఈ రోజుల్లో మన అలవాట్లు ఎలా ఉన్నాయో ఆలోచిద్దాము. పిండికొట్టి, కట్టె పుల్లల పొయ్యి మీద చిరుతిండ్లను వండిపెట్టవలసి వస్తే, ఈ రోజుల్లో స్త్రీలు కనీసం పండుగ రోజున కూడా వండిపెట్టరు. ఈ రోజుల్లో చిరుతిండ్లను వండుకోవడం ఎందుకు ఎక్కువ అయ్యిందంటే, పిండికొట్టుకోనక్కర్లేదు, జల్లించక్క ర్లేదు, చిటికెలో వండడం అయ్యే గ్యాసు పొయ్యిలు, పైగా వండుకోవడానికి డబ్బులకిబ్బంది లేదు. పనికి పిల్లలు అడ్డం వస్తారనే సమస్య లేదు. ఇన్ని సౌకర్యాలన్నీ ఒక ఎత్తు అయితే, ఆ వండిన చిరుతిండ్లు త్వరగా చెడిపోకుండా దాచుకునే ఫ్రిజ్లు వచ్చి వాటిని ఇంకా ఎక్కువ రోజులపాటు తినేట్లుగా చేస్తున్నాయి. రెండు మూడు రకాలుగా వండుకుని, డబ్బాలలో దాచుకుని రోజూ అటువచ్చి ఒక స్వీటు, ఇటు వచ్చి ఒక హాటు తింటూ, టివీలు చూస్తూ ఊసిపోక మధ్య మధ్యలో కర్కర్లు, ఫట్ఫట్లు ఆడిస్తుంటారు. స్కూలు నుండి పిల్లలు వచ్చినా, బయట నుండి బంధువులొచ్చినా వచ్చిందే తడవుగా వాటితోనే స్వాగతాలు. ఒకవేళ ఎప్పుడన్నా వండుకోవడం కుదరకపోతే, తినడం మిస్ కాకుండా ఉండడానికి ఒక ఫోను కొడితే చాలు 'స్వగృహ ఫుడ్స్' క్షణాల్లో వచ్చి వాలుతున్నాయి. ఇలా రోజూ ఏదో ఒకటి ఇంటిల్లపాది అందరూ కలిసి తింటూఉంటే, సరిగా బ్రతుకుతున్నట్లుగా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇలా రోజూ ఏదో ఒకటి వండి పెడితే మా అమ్మ మంచిదని పిల్లలు, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుందని ఆయన అనుకుంటూ పొంగిపోతుంటారు. ఇలా చిరుతిండ్లను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో లోపల వేస్తూనే ఉంటారు. ఇంట్లో వండుకున్నవి కాస్త బోరుకొడితే రోడ్ల ప్రక్కన ఉండే బజ్జీలు, కట్లెట్లు, సమోసాలు, వేడివేడి పకోడీలు, ఎంగ్లోబోండాలు ఇంకా వగైరాలు వారానికి మూడు నాలుగు సార్లు ముచ్చటగా తింటూ ఉంటారు. బయట వీటిని పురుషులే తింటే ఇంట్లో ఉండేవారు ఈ టేస్టులకు మిస్ అవుతున్నారని, వాళ్ళందరకూ ప్రత్యేకించి ప్యాకింగులతో పట్టుకుని వస్తుంటారు. ఇక శెలవు దినాలలో, పండుగ సందర్భాలలో, సినిమా షికార్లలో అయితే ఈ రకాలన్నింటినీ మించి ఐస్క్రీమ్లు, డ్రింక్లు, పీజాలు, బర్గర్లు, నూడిల్స్, కేకులు మొ||నవి ఎంతో ఖర్చు పెట్టి తింటున్నారు. ఇటు పిల్లలకొరకు అని చెప్పి పెద్దలు కూడా వీటిని కొని వాళ్ళతో పాటు హాయిగా తిని తిరుగుతున్నారు. ఇలా కుటుంబం అంతా కలిసికట్టుగా ఇలాంటి పనులు చేస్తున్నారు. వీటి పర్యవసానం ఏమిటో ఎంతవరకు దారితీస్తాయో, ఏ అనర్థాలు వస్తాయో అన్న ఆలోచన ఎవరిలోను ఏ కోశానా కనబడడం లేదు. చివరకు పిల్లలు, పెద్దలు అందరూ జబ్బులతో హస్పిటల్స్ పాలు అవుతున్నా తరుచు జ్వరాలు, రొంపలు, దగ్గులు వస్తున్నా కనువిప్పు కలగడం లేదు. అది తప్పు అలా తినకూడదని చెప్పే నాధుడు లేకుండా పోయాడు. చివరకు వైద్యులన్నా చెప్పడానికి మిగుల్తున్నారా అంటే వారు కూడా భార్యాపిల్లలను వేసుకుని వెళ్ళి ఇలాంటి చెత్తని తింటూ ఉన్నారు. అందుచేతనే జబ్బులనేవి వైద్యులను, వాళ్ళ కుటుంబీకులను కూడా వదిలి పెట్టడం లేదు. | సమాజంలో అంటురోగంలాగా ఈ చిరుతిండ్ల రోగం వ్యాపించి, పుచ్చిపోయిఉన్నవి. ఈ రోగాన్ని వదిలించుకోవాలంటే ముందు వీటివల్ల శరీరం పడే ఇబ్బందులను తెలుసుకుందాము.
ఎక్కువగా ఈ చిరుతిండ్లు అన్నీ 300 డిగ్రీలపైగా వేడెక్కిన నూనెలో 5, 10 నిమిషాలు ఉంచి వేగిన తరువాత వాటిపై అనేకం చల్లి తింటాము. 100 డిగ్రీల వేడిలో అన్నం కూరలు ఉడికినందుకే అందులో పోషక పదార్థాలు 60, 70 శాతం నశిస్తుంటే మరి 300 డిగ్రీల వేడిలో వేసి దేవిన పదార్థాలలో మిగిలేదేమిటి? మనకేమీ లాభం రాకపోయినా కనీసం నష్టం కలిగించకుండా ఉంటే అదృష్టవంతులమే. ఆహార పదార్థమల్లా పూర్తి వ్యర్థ పదార్థంగా, విష పదార్థంగా మారుతుంది. అలా నూనెలో మరిగిన వాటిపై ఉప్పు, కారాలు చల్లే సరికి, నాలికకు మాత్రం అది కమ్మగానే ఉంటుంది. శరీరానికి కావలసినది మాత్రం పోషకపదార్థాలు. ఇక బయటకొనే చిరుతిండ్లు అయితే అందులో కెమికల్స్ రంగులు, మందులు అనేకం కలిపి తయారు చేస్తారు. ఇవన్నీ శరీరానికి ఇంకా భారం అవుతాయి. మన శరీరం మనం తిన్న పదార్థాలలో అవసరమయిన వాటిని గ్రహించుకుని తన పోషణ కోసం ఉపయోగించుకుంటూ అనవసర మయిన వాటిని వదిలేస్తూ ఉంటుంది. ఈ రెండు పనులు చేయడానికి శరీరానికి కొంత శక్తి ఖర్చు అవుతుంది. అవసరమైన పదార్థాలను జీర్ణం చేయడానికి అయ్యే ఖర్చు కంటే అనవసరమైన వాటిని బయటకు పంపడానికి, వాటివల్ల కలిగే చెడు నుండి రక్షించుకోవడానికి ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఉదా॥ ఎప్పుడన్నా గాలి దుమారాలు వచ్చినప్పుడు చెట్ల ఆకులు, రోడ్డు మీద దుమ్ము, ధూళి అంతా వచ్చి మన వాకిట్లో పడుతుంది. గాలి తగ్గిన తరువాత ఆ చెత్తనంతటినీ శుభ్రం చెయ్యడానికి ఇంట్లో స్త్రీలకు ఎంత శ్రమ అవుతుందో గదా! రోజూ ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవడానికి పడే శ్రమ కంటే 10 రెట్లు ఈ దుమ్మును ఎత్తివేయడానికి శ్రమపడాల్సి వస్తుంది. అలాగే, చిరుతిండ్లు, కేక్ లు, ఐస్ క్రీమ్ లు, బజ్జీలు మొదలగునవి మనం తింటే వీటిని జీర్ణం చేయడానికి శరీరానికి ఎంతో శక్తి వృధా అవుతుంది. చివరకు అంత కష్టపడి శరీరం జీర్ణం చేసినా ఆ ఆహార పదార్థాలనుండీ శరీరానికి కొంచెం కూడా పోషక పదార్థాల లాభం ఉండదు. పైగా ఈ చెత్తలో ఉండే విషపదార్థాలను, వ్యర్థ పదార్థాల నుండీ శరీరాన్ని రక్షించుకోవడానికి, బయటకు గెంటడానికి ఎంతో శక్తి ఖర్చు చేయవలసి ఉంటుంది. మనలో ఉన్న రోగనిరోధకశక్తి అంతా ఈ చెత్త ఆహారం నుండి రక్షించుకోవడానికి వృధా అవుతుంది. వీటివల్ల రోగనిరోధకశక్తి క్షీణిస్తుంది. చిరుతిండ్ల తుఫానులు మనం కురిపిస్తుంటే శరీరానికి శ్రమ ఎక్కువై ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతుంది. గాలి దుమారాలప్పుడు ప్రక్కవారి కొబ్బరికాయలు వచ్చి మన దొడ్లో పడుతూ ఉంటే ఎంతో సంబరంగా ఏరుకుని దాచుకున్నట్లే మన శరీరం కూడా సహజాహారామైన పండ్లులాంటివి దొరికనప్పుడు వాటిని అంత బాగా గ్రహిస్తుంది. ఇంత సహజమైన శరీరానికి అంత అసహజమైన ఆహారాన్ని అందిస్తూ రోగాలను మనమే స్వయంగా ఆహ్వానించుకుంటున్నాము.
👉చిరుతిండ్ల వల్ల శరీరానికి వచ్చే ఇబ్బందులు:
1) నూనెలో దేవి తయారుచేసిన ఆహార పదార్థాలు తినేసరికి ఆకలి చచ్చిపోతుంది. అందుకే అవి తిన్నాక పిల్లలు భోజనం వద్దని గొడవ చేస్తారు.
2) తిన్న తరువాత నుండి అందులో ఉన్న ఉప్పు, నూనెల కారణంగా ఎక్కువగా దాహం వేస్తుంది. అప్పుడు నీరు త్రాగడం వల్ల కడుపు చెడిపోతుంది.
3) ఈ ఆహార పదార్థాలలో పీచు పదార్థం సున్నా. విరేచనం రాదు. పిల్లలు, పెద్దలు ఈ మధ్య రెండు, మూడు రోజులకు వెళు తున్నారు. 4) రక్తనాళాలు పూడుకు పోవడం, వయస్సుతో నిమిత్తం లేకుండా
గుండె జబ్బులు రావడం జరుగుతుంది.
5) ఈ తిండ్లలో ఉన్న దోషాల వల్ల తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. రొంపలు, కఫాలు, దగ్గు మొదలగునవి తరచుగా వస్తూ ఉంటాయి.
6) శరీరంలో వ్యర్థపదార్థాలు పెరగడం వల్ల కూడా తరచుగా వస్తాయి.
7) శరీరంలో చెత్తంతా క్రొవ్వుగా పేరుకొని పోయి బరువు పెరిగి పోతూ ఉంటారు.
8) ఇవి తినేవారికి మంచి ఆహారం . సహజాహారం తినాలని కోరిక ఉండదు.
9) దీర్ఘ రోగాలు వచ్చే అవకాశాలు శరీరానికి కలిగిస్తాయి. ఇన్ని అనర్థాలు కలిగించే చిరుతిండ్లను పెద్దలు పిల్లలకు రోజూ అందించకుండా పండుగలప్పుడో, శుభకార్యా లప్పుడో తింటూ ఉంటే ఆరోగ్యానికి అంత హాని కలిగించవు. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు తింటే ఆ రోజు సాయంత్రం 3, 4 గంటల మధ్య పూర్తిగా వాటినే తిని ఇక భోజనం మానెయ్యండి. మళ్ళీ తరువాత రోజు వాటి జోలికి పోకండి. చుట్టం చూపులో వీటిని తినాలే తప్ప, ఆహారంలాగా వీటిని తినడం మానండి. మన పెద్దలు నేర్పినట్లు ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో ప్రతి రోజూ తింటూ ఉంటే మనస్సు వాటి పైకి పోదు. ఆరోగ్యానికి చిరుతిండ్లు అంటే నువ్వుల ఉండ, వేరుశెనగపప్పు ఉండ (ఇవి రెండూ ఖర్జూరం పండ్లతో చేసుకోవాలి). పచ్చివేరు శెనగకాయలు, మొక్కజొన్న పొత్తులు, తేనెతో ఫ్రూట్ సలాడ్లు మొదలగునవి వాడుకుంటే మంచిది. ఇంట్లో పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా వాడుకుంటే ఏ తేడాలూ రావు. పెద్దలుగా మనకు మంచి అలవాట్లు వస్తే పిల్లలు బాగుపడతారు. కాబట్టి పెద్దవారిగా ముందు మనం మారి మన పిల్లలకు మంచి మార్గం చూపుదాం. కుటుంబం అంతా ఆరోగ్యంగా జీవిద్దాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని నిరూపిద్దాం.