-->

పిల్లలు చెప్పేది వింటున్నారా? | Do you listen to children?


Do you listen to children?

పిల్లలు చెప్పేది వింటున్నారా?

పిల్లలు ఏం చెప్పబోయినా పెడచెవిన పెడతాం. వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోం. కానీ పిల్లలు చెప్పే విషయాల పట్ల శ్రద్ధ కనబరచడం ద్వారా వాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా అల్లరితో పెద్దల దృష్టిని ఆకర్షించే అలవాటు దూరమవుతుంది.

పిల్లలు తమ ప్రతి ఆలోచననూ, అనుమానాన్నీ మాటల్లో బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. తమ ఇష్టాఇష్టాల్నీ, బాధల్నీ, సంతోషాల్నీ తల్లితండ్రులతో పంచుకోవటానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. అమ్మానాన్నా తాము చెప్పేది విని తమతో ఏకీభవించాలనీ లేదా తమను ఓదార్చాలనీ, చెప్పింది విని తమతో కలిసి నవ్వాలనీ పిల్లలు కోరుకుంటారు. కానీ పిల్లలు కోరుకున్నట్టుగా ప్రతి ఇంట్లో జరగదు. పిల్లల మాటలను పెడచెవిన పెట్టే తల్లితండ్రులే ఎక్కువ. ఈ ధోరణి వల్ల పిల్లలకు తల్లితండ్రులకు మధ్య బంధం బలహీనపడొచ్చు. అత్యవసరంగా చెప్పవలసిన విషయాలు కూడా పిల్లలు తల్లితండ్రులకు చెప్పటానికి వెనకాడే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే


* పిల్లలు చెప్పే ప్రతి విషయాన్నీ శ్రద్ధగా వినాలి.

 * వినేటప్పుడు చెవులు మాత్రమే అప్పగించకుండా పిల్లల కళ్లలోకి సూటిగా చూస్తూ వినాలి. 

* విసుగ్గా కాకుండా ఆసక్తితో, చిరునవ్వుతో వినాలి.

* పిల్లలు చెప్పడానికి సంశయిస్తున్నా, ఇబ్బంది పడుతున్నట్టు అనిపించినా వాళ్లని ప్రోత్సహించాలి. 

* మాటలు దొరక్క వెతుక్కుంటుంటే అందించాలి.

* ఎంత పనిలో ఉన్నా పిల్లల మాటలు వినటం కోసం సమయం కేటాయించాలి. 

* ఒకవేళ ఊపిరి సలుపుకోని పనిలో ఉంటే, తర్వాత వింటాను అని పిల్లలతో చెప్పి, అన్నట్టే చేయాలి.. 

* పిల్లల మాటలను మధ్యలోనే ఖండించకూడదు. వాళ్లు చెప్పబోయేది తెలిసిపోతున్నా ఆసక్తితో వినాలి. 

* పిల్లలచేత మాట్లాడించటం వల్ల మనసులోని భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేయగల నైపుణ్యం మెరుగవుతుంది. అర్ధవంతంగా మాట్లాడే విధానం పిల్లలకు అలవడుతుంది. కాబట్టి పిల్లలను మాట్లాడనివ్వండి, ఆసక్తిగా వినండి. .

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT