రోజంతా.. ఉల్లాసమే!
ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగండి. అప్పటిదాకా స్తబ్ధుగా ఉన్న అవయవాలు, కండరాల్లో ఉత్తేజం కలగడానికి ఇది సాయపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అంతే కాదు మలినాలు బయటకు వెళ్లడంతోపాటు శరీరానికి ఉత్సాహమూ అందుతుంది.
పని వేచి చూస్తోందని తెలిసినా..
ఓ పది నిమిషాలు ధ్యానం, వ్యాయామాలకు కేటాయించండి. ధ్యానం మానసిక ఆరోగ్యానికి కృషి చేసి ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనివ్వదు. సానుకూల ఆలోచనలకు కారణమవుతుంది. వ్యాయామం శారీరక దారుఢ్యాన్ని ఇవ్వడంతోపాటు మతి మరపునూ దూరంగా ఉంచుతుంది. పెద్ద పెద్దవే చేయనక్కర్లేదు. చిన్న చిన్న స్ట్రెచ్‌లు సరిపోతాయి.
పరిస్థితిని బట్టి ఒకేసారి ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. నిజమే! కానీ ఇది మెదడును తికమక పెడుతుంది. అప్పటిదాకా గుర్తుండి.. ఇంతలోనే మర్చిపోయామనుకుంటామే! ఇదే కారణం. చేసిన పనిపై సంతృప్తి కలగకపోవడానికి మూలమిదే. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్లండి. ముఖ్యంగా కష్టమైన వాటిని ముందు, తేలికైన వాటిని చివర్లో చేయండి. దీనికి సంబంధించిన జాబితాను రాత్రే సిద్దం చేసుకుంటే ఉదయానికి పనీ సులువవుతుంది. మీకు మర్చిపోయే బాధ, దాని వల్ల కలిగే అసంతృప్తి తప్పుతాయి.