![]() |
telugu story |
కథ 01
పూర్వం పుష్యమిత్ర వనంలో ఒక పే..ద్ద మర్రిచెట్టు కింద శాంత మహాముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన మహాజ్ఞాని. చాలా విద్యలు వచ్చు. ఆ మహాముని జంతువులతోనూ మాట్లాడగలడు.
అంతేకాకుండా ఇతర జీవుల శరీరంలో ప్రవేశించగల 'పరకాయప్రవేశ విద్య' కూడా తెలిసిన వాడు. అప్పుడప్పుడు ఇతర జంతువుల మృత కళేబరాల్లోకి ప్రవేశించి.. తిరిగి తన దేహంలోకి వచ్చేవాడు. జంతువులన్నీ కూడా ఆ ముని దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుని పరిష్కార మార్గాలు తెలుసుకుంటూ ఉండేవి. అదే సమయంలో ఆ మునికి కావాల్సిన అన్ని వసతులనూ సమకూర్చేవి. ఆహారాన్ని కూడాఅందించేవి.
ఆ వనంలోనే ఉండే ఒక కోతి మహాముని దగ్గరకు వచ్చి 'మునివర్యా! నాకు ఆకాశంలో పక్షిలాగా ఎగరాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకని నాకు మీరు పరకాయ ప్రవేశ విద్యను నేర్పిస్తే.. నేను నా కోరికను నెరవేర్చుకుంటాను' అంది. 'వద్దు.. వానరమా! అది ఎంతో రహస్యమైన విద్య దాన్ని పూర్తిగా నేర్చుకుని సంపూర్ణత సాధిస్తేనే దాన్ని ఉపయోగించాలి. ఒకవేళ సరిగ్గా నేర్చుకోకుండా ప్రయోగిస్తే అది వికటించే ప్రమాదమూ ఉంది. అందుకే నేను నీకు ఆ విద్యను చెప్పను' అని అన్నాడు మహాముని. చేసేది లేక అది అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కానీ కోతి ఆ విద్యను ఎలాగైనా సరే నేర్చుకుని పక్షుల మాదిరిగా గాల్లో ఎగరాలని పెదలు చెబితే వినాలి! ! భావించింది. ఒక రోజు ముని పరకాయ ప్రవేశం చేస్తుండగా.. ఆయనకు తెలియకుండా పక్క నుంచి గమనించింది. సరిగ్గా నేర్చుకోకుండానే తాను కూడా ఒక చనిపోయిన కాకి దేహాన్ని తీసుకొచ్చి దానిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అది ఎగరడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎగరలేక ఇబ్బంది పడింది. ఇక లాభం లేదనుకుంది.
కాకి శరీరం నుంచి బయటకు రావడానికి తెగ ప్రయత్నం చేసింది కోతి. కానీ అది కొన్ని విషయాలు మర్చిపోయింది. అందుకే ఎలా బయటకు రావాలో దానికి అర్ధం కాలేదు. వెంటనే ముని దగ్గరకు వచ్చి 'మునివర్యా! నేను కోతిని' అనగానే.. 'అదేమిటి నువ్వు కాకివి కదా.. కోతిని అంటున్నావేంటి? ' అన్నాడు ముని అనుమానంగా! 'మునివర్యా! నన్ను మన్నించండి. నేను కోతినే.. మీరు వద్దన్నా వినకుండా కాకిలో పరకాయ ప్రవేశం చేశాను. కానీ ఇప్పుడు బయటకు రాలేకపోతున్నాను. నన్ను మీరే కాపాడాలి. నాకు దీని నుంచి బయటకు వచ్చే మార్గం చెప్పండి' అని వేడుకుంది. 'ఓ వానరమా! ఎంత పని చేశావు. నేను అంత స్పష్టంగా చెప్పినా వినకుండా ఈ సాహసం చేశావు. ఇప్పుడు దానికి ఫలితం అనుభవిస్తున్నావు. సరే.. సరే.. ముందు నీ దేహం ఎక్కడుందో చూపించు.
మళ్లీ నిన్ను నీ శరీరంలోకిపంపిస్తాను' అన్నాడు మహాముని. 'అదిగో.. ఆ పక్కనే ఉన్న రావిచెట్టు కింద ఉంది మునివర్యా!' అంది కాకి దేహంలో ఉన్న కోతి. అక్కడికి వెళ్లి చూసేసరికి కోతి శరీరాన్ని తినేసి అప్పుడే అక్కడి నుంచి వెళ్లిపోతున్న పులి కనిపించింది. అది చూసి కాకి శరీరంలో ఉన్న కోతి ఒక్కసారిగా అవాక్కయింది. 'అయ్యో! అయ్యో! నా శరీరం.. నా శరీరం' అంటూ గగ్గోలు పెట్టింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూర్తిగా నాశనం అయిన దేహాన్ని చూసి గట్టిగా ఏడ్చింది.
చూడు వానరమా! పెద్దలు చెప్పే మాటలు వినకుండా.. ఆ... ఏమి జరుగుతుంది లే..! అని నిర్లక్ష్యంతో చేసే పనులు ఇదిగో ఇలానే మన మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తాయి. ఇక నువ్వు బతికినంత కాలం నీకు నచ్చినా నచ్చకున్నా ఇలానే కాకిలాగానే ఉండాలి తప్పదు' అన్నాడు మహాముని. ఇక చేసేది లేక ఇబ్బందిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది కాకి రూపంలో ఉన్న కోతి.