మనిషిని చదవాలి!
మనం ఎన్నో విధాలైన పుస్తకాలు చదువుతాం. ఎంతో నేర్చుకుంటాం. తెలిసిన జ్ఞానం పది మందికీ పంచుతాం. మనం మనిషిని సరిగ్గా చదవడం లేదు. మనిషిని చదవడం అంటే ఎదుటి మనిషి స్వభావాన్ని, మాట తీరును, ప్రవర్తనను, మంచి-చెడులను అర్థం చేసుకోవడం. మనిషి సంఘజీవి. అన్ని విషయాల్లోనూ సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి సాటివారి మీద ఆధారపడక తప్పదు. పంట ఒకడు పండిస్తున్నాడు. ఇల్లు వేరొకడు కడుతున్నాడు. గుడ్డ మరొకడు నేస్తున్నాడు. వేర్వేరు వస్తువులను వేర్వేరు వ్యక్తులు తయారు చేస్తున్నారు. మన దగ్గర డబ్బే ఉంది. ఆ డబ్బు ఖర్చుచేసి, అన్నీ కొని తెచ్చుకుంటున్నాం. అందుచేత చాలా మందితో మనకు అనుబంధం ఉంటుంది. సంబంధం ఉంటుంది. ఈ సంబంధాలను, అనుబంధాలను ఎంత వరకు కొనసాగించాలి? ఎంత వరకు పెంచుకోవాలి? ఎంతకాలం పటిష్ఠంగా ఉంచుకోవాలి? ఎవడు తన అవసరం కోసం మనల్ని పొగుడుతున్నాడు? ఎవడు చిత్తశుద్ధితో మనల్ని అభినందిస్తున్నాడు? ఇది గ్రహించడమే మనిషిని చదవడం అనిపించుకుంటుంది. మన జీవన యానానికి, భవిష్యసాధ నిర్మాణానికి ఇది చాలా అవసరం.
మనిషిని చదివే చదువు గ్రంథాలు, ప్రబంధాలు అధ్యయనం చేసినంత మాత్రాన వచ్చేది కాదు. అయితే వాటి అధ్యయనం కొంత వరకు తోడ్పడవచ్చు. కాని ఎదుటి మనిషి సంభాషణ, నడత, వృత్తి, ప్రవృత్తి, పరిశీలించి పరిచయాన్ని గాని, స్నేహాన్ని గాని పెంచుకోవడం మనిషికి శ్రేయోదాయకం. కొందరు పరిచయం కాగానే చనువు పెంచుకుని అతిగా స్నేహం చేస్తారు. అది మంచికి దారి తీయవచ్చు. కీడే కలిగించవచ్చు. ఏదయినా ‘అతి’ అనర్థదాయకమే! కొందరు ప్రతి మనిషిని, మాటను అనుమానిస్తారు. వాళ్ల మీద వాళ్లకే నమ్మకం ఉండదు. దీనివల్ల శత్రువులు పెరుగుతారు.
ఎదుటి మనిషిలోని నిజాయతీని గ్రహించగలగడానికి కూడా స్వతంత్రాలోచనశక్తి ఉండాలి. సానుకూల దృక్పథం అలవరచుకోవాలి. సహనశీలత పెంచుకోవాలి. నిందలను సహించేవారు వందనీయులే. శ్రీకృష్ణుడు నీలాపనిందకు గురైనా సత్యజిత్తును దూషించలేదు. ఆ నిందను తొలగించుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. సాత్వికగుణం సాటివాణ్ని అర్థం చేసుకునేందుకు సహకరిస్తుంది. రకరకాల విమర్శలకు గురవుతాం. అంతటితో కుంగిపోనక్కర్లేదు. అది సద్విమర్శయితే అంతర్ విశ్లేషణ చేసుకుంటాం. అసూయతో చేసిన కువిమర్శయితే నిర్లిప్తంగా వదిలేస్తాం.
రామాయణ, భారత, భాగవతాల్లో అనేక సందర్భాల్లో ఈ విషయానికి సంబంధించిన పాత్రలెన్నో కనిపిస్తాయి. ధర్మ పక్షపాతులైన పాండవుల శక్తిని గ్రహించక, అహంకరించి దుర్యోధనుడు అనుజులతో సహా పతనమైపోయాడు. ధర్మస్వరూపుడు శ్రీరాముడి శక్తిని గ్రహించలేని మూర్ఖుడు దశకంఠుడు నిహతుడైపోయాడు. గోపికల మనసులను చదివిన కృష్ణ పరమాత్మ వారికి తోడునీడై ఆదుకున్నాడు.
మనిషిని చూడ్డానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి. ఇతరులను అర్థం చేసుకోలేనివాడు సమాజంలో జీవించలేడు. మనకు ఆపదలు వచ్చినప్పుడే అసలైన బంధువులు, మిత్రులు, హితైషులు ఎవరో తెలుస్తుంది. విశ్వసనీయుడని సాటి మనిషిని గ్రహించగలిగితే, ఆనందం మనకు నీడలా వెన్నంటే ఉంటుంది. మనతో కలిసి నవ్విన మనిషిని మరిచిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో కలిసి దుఃఖించే మనిషిని మాత్రం మరచిపోకూడదు.
ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థా శ్రమము అయి వున్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన యింద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు యింద్రియ సుఖమును అనుభవించవచ్చు.
కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొనిన నాడు నీ యింద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసు కోవడానికి ఆశ్రయ నీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యదార్థ ధర్మములను పాటిస్తూ యింద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు.
కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి యింట పెట్టుకో.
సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి యింట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు.
నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు.
మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.
అపుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు.
పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు.
కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో” అన్నాడు.
ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.
ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి విడి విడిగా అడవులకు వెళ్లిపోయారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు.
కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నాడు.
దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులు తున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవి మీదికి బాణం వేస్తే తల లోకి గుచ్చుకుంటుందని అనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు.
యాదవ వంశ నాశనము కొరకు పుట్టిన ముసలమును గొల్ల వారు అరగ తీయగా మిగిలిన ముక్క ఈ బోయవాడికి దొరికి బాణంలా మారి, ఏ పాదములయితే ఈ గోపాల బాలురను అలరించాయో, లోకము నంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయిపోయాడో, ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో...
ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ పాదములు దర్శనం యిచ్చాయో, అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ “హా” అని అరిచాడు.
ఆ శబ్దం విని బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది.
అదిచూసిన బోయవాడు “అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు యిక నిష్కృతి లేదు” అని నేలమీద పడి ఏడ్చాడు.
అపుడు కృష్ణ పరమాత్మ “నాయనా నీవు నిమిత్త మాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరం లోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను” అన్నాడు.
దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. “ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవడమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా!” అని విలపించాడు.
అపుడు కృష్ణుడు “నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు” అని చెప్పాడు.