-->

Story 07 | కుందేలు మంచితనం | prudhviinfoకుందేలు మంచితనం


 ​మహేంద్రగిరి ప్రక్కనున్న అడవిలో ఒక కుందేలు కుటుంబం ఉండేది. వాటి పిల్లల్లో చిన్నదానికి చూపు లేదు. అందుకెంతో దిగులు పడేది కుందేలు కుటుంబం. 

దూరంగా ఉండే అడవి నుండి వచ్చిన ఒక మైనాకు కుందేలు కుటుంబం దిగులు పడుతున్న సంగతి తెలిసింది. కుందేలు దంపతులను కలిసి 'మా అడవిలోని ముసలి కోతికి అద్భుత శక్తులున్నాయి. దాన్ని కలిస్తే మీ పిల్లకు చూపు రావచ్చు' అంది.    

ఒక రోజు ఉదయమే మగ కుందేలు బయల్దేరింది. అది వెళ్తుండగా ఎలుగుబంటి ఎదురైంది. “అల్లుడూ! పొద్దున్నే బయల్దేరావు. ఎక్కడికో!’ అని అడిగింది. తన పిల్లకి చూపు తెప్పించడానికి కోతి దగ్గరకి వెళుతున్నట్టు చెప్పింది కుందేలు. 

ఎలుగు “నాకూ ఒక సమస్య ఉంది. అడుగుతావా?” అని బ్రతిమాలాడింది. అలాగే అంది కుందేలు. ‘దొడ్లో నుయ్యి తవ్వించాను కానీ నీరు పడలేదు. ఎందుకో కనుక్కో’ అంది ఎలుగు.   

 అలాగే అనేసి కుందేలు వెళుతుంటే ఈసారి ఒంటె పలకరించి ‘ఎక్కడిదాకా?‘ అనడిగింది. ఎలుగుకి చెప్పినట్టే దానికీ చెప్పింది కుందేలు. ‘నాకూ సమస్య ఉంది. కోతిని అడిగి నాకు జవాబు చెప్పవూ‘అని బ్రతిమలాడింది ఒంటె. 

సరే అని కుందేలు అనగానే ‘కొన్నాళ్లుగా తలనెప్పితో బాధపడుతున్నాను. ఎందుకో కోతిని కనుక్కో’ అంది ఒంటె. సరే అనేసి మళ్ళీ నడక మొదలుపెట్టింది కుందేలు. 

ఈసారి అడవి దున్న ఆపింది కుందేలుని. ముందు చెప్పినట్టుగానే దానికీ చెప్పింది కుందేలు. తనకీ ఒక సమస్య ఉందని, మేత మేస్తుంటే ఏదో అడ్డుపడి మింగలేక పోతున్నట్టు చెప్పిందది. సరే అడుగుతానని చెప్పింది కుందేలు. 

అలా నడుచుకుంటూ వెళ్ళిన కుందేలు రెండురోజుల్లో ముసలి కోతిని కలుసుకుంది. కుందేలుని చూసి వచ్చిన పనేమిటో చెప్పమంది ముసలి కోతి.  

“నా పిల్ల గురించి ముందుగా అడిగితే స్వార్ధవుతుంది. వాళ్ళ ప్రశ్నల్నే మొదట అడిగి ఆఖరున నాది చెబుతాను’ అనుకున్న’ కుందేలు అలాగే చేసింది. 

ఎలుగుబంటి, ఒంటె, అడవి దున్నల సమస్యల్ని ముసలి కోతితో చెప్పి పరిష్కారం అడిగింది.

కళ్ళు మూసుకునే మూడింటికి పరిష్కారాలు చెప్పింది ముసలి కోతి. చివర్లో తన పిల్ల గురించి కుందేలు అడగబోతుంటే ‘మూడు ప్రశ్నలకు మించి జవాబు చెప్పే శక్తి లేదు’ అనేసింది కోతి. 

తన పని కాలేదని బాధ పడుతూనే తిరుగు ప్రయాణమైంది కుందేలు. 

దారిలో అడవి దున్న దగ్గర ఆగి “నీ గొంతులో వజ్రం అడ్డుపడింది. దాన్ని తీస్తే మేయగలవు” అంది. ‘నువ్వే దాన్ని తియ్యరాదా’ అంది అడవిదున్న. దాని గొంతులో అడ్డుపడిన వజ్రాన్ని బయటకు లాగింది కుందేలు. వజ్రాన్ని కుందేలుకి ఇచ్చేసింది అడవి దున్న. 

ఈసారి ఒంటెని కలసి ‘నీ ఎడమ చెవిలో ఏదో రాయి ఉంది. దాన్ని తీస్తే నీ తలనెప్పి ఎగిరి పోతుంది” అంది కుందేలు. 

‘నువ్వే అది తియ్యరాదా’ అని బ్రతిమాలాడింది ఒంటె. జాగ్రత్తగా రాయిని బయటకు తీసి చూడగా అదొక విలువైన మణి. ‘నువ్వే ఉంచుకో ‘ అని మణిని కుందేలుకి ఇచ్చేసింది ఒంటె.

వజ్రాన్ని, మణిని చెరో చేత్తో పట్టుకుని కుందేలు వెళుతుండగా ఎలుగు కనబడింది. ‘నువ్వు తవ్వించిన నుయ్యి అడుగున పెద్ద రాళ్లు ఉన్నాయట. అవి తీస్తే నూతిలో నీరు ఊరుతుంది” అంది కుందేలు. 


‘నేనొక్కర్తినే తియ్యలేను. నువ్వు సాయం చేస్తావా’ అని బ్రతిమలాడింది ఎలుగు. ఆ రెండూ కలసి మరికొన్ని జంతువులని పిలిచి నూతిలోని రాళ్లను బయట పడేసాయి. రాళ్ల క్రిందన రెండు లంకె బిందెలు దొరికాయి వాటికి. బిందెల్లో బంగారు నాణాలున్నాయి. తనకు చేసిన మేలుకి కృతజ్ఞతగా ఒక బిందెను కుందేలుకి ఇచ్చింది ఎలుగు. 

వజ్రాన్ని, మణిని, బిందెను మోసుకుని తిన్నగా మృగరాజు దగ్గరకు వెళ్ళింది కుందేలు. అవి తనకు ఎలా వచ్చాయో చెప్పి వాటిని రాజుగారినే తీసుకోమని అప్పగించింది. 

కుందేలు చేసిన పనికి, స్వార్ధం లేకుండా ప్రవర్తించినందుకు ఆశ్చర్యపోయింది మృగరాజు. అక్కడున్న జంతువులు కూడా కుందేలు యొక్క మంచితనాన్ని మృగరాజుకి చెప్పాయి.

కుందేలుని మెచ్చుకోవడమే కాకుండా ఘనంగా సత్కరించింది మృగరాజు. రాజ్యంలోని ఉత్తమ వైద్యుడిని కుందేలు ఇంటికి పంపించి కుందేలు పిల్లకు వైద్యం చేయించింది. కొన్నాళ్ళకు కుందేలు పిల్లకు చూపు వచ్చింది. కుందేలు కుటుంబం సంతోషించింది .  

*కుందేలు చూపిన మంచితనమే దానికి రక్షగా నిలిచిందని, దాని పిల్లకు చూపు తెప్పించిందని అడవిలోని జంతువులు చెప్పుకున్నాయి.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT