-->

Story 06 | అహం - భావం | prudhviinfoఅహం - భావం

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు.... ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేకపోయేవారు. 

ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.

ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ! ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego] నింపాయి.

ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి *'' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి... ఆయన ఇలా అనుకొన్నాడు : ' నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తాను. 

కాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను, మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కివుంచుతాను...

అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. 

నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు ... ' అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు. 

మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది..., శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. 

దేవత వెతుకుతూ వస్తోంది, ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి...

ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు , శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది, ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేక పోయింది. 

ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వేల్లిపోవలనుకొని వెనుతిరిగింది. 

శిల్పి ఆనందనాకి అవధులు లేవు, తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు...

 ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి '' *ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! అంది.

'' అంతే ! మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది, తన కెరీర్ లో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరుకూడా వంక పెట్టలేదు, అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు. 

వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో '' *ఏది ? ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది, ఏ తప్పూ లేదు* ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , " నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని, కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే, నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు ! ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది, అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది."

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది. 

అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు , ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. 

నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము. 

స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం. 

'' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '. అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు...

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT