'సత్యం శివం సుందరం''
సుందర్రావు గారు మంచి ఉద్యోగంలోనే రిటైరయ్యారు. ఎక్కడకు స్వాగత మర్యాదలు బాగుండేవి. అధికార హోదా అలాంటిది మరి.
ఎంత పెద్ద అధికారి అయినా ఏదో ఒక రోజు పదవీ విరమణ చెయ్యవలసిందే కాబట్టి సుందర్రావు గారిని కూడా ఆ నెల చివరి రోజున సతీ సమేతంగా గౌరవించి సగౌరవంగా ఇంటికి ఆఫీసు కారులోనే సాగనంపారు.
ఆ మర్నాడు ఆఫీసుకి వెళ్తే అందరు లేచి నిలబడి నమస్కరించి 'ఎలా ఉంది సార్ రిటైర్డ్ లైఫు?' అన్నవాళ్ళే.
'ఒక్క రోజుకే ఏం తెలుస్తుందోయ్?' అంటూ నవ్వుతూ తనకు రావలసిన పదవీ విరమణ సొమ్ము తాలూకు కాగితాల మీద సంతకం పడేసి లేచారు సుందర్రావు గారు.
అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన్ని ఆఫీసులో పట్టించుకోవడం తగ్గించారు. 'హలో సార్' అని మాత్రమే అనడం మొదలయింది.
ఈయన కూడా ఇదివరకటి మర్యాదలు లభించడం లేదని ఆఫీసుకి వెళ్ళడం మానేసారు.
ఐతే ఆ స్వాగత సత్కారాలకు అలవాటు పడిన సుందర్రావు గారికి జీవితం వెలితిగా అనిపించింది.
అందుకే ఆయన మరొక మార్గం ఎంచుకున్నారు. అవే దానాలు. ఐతే భూరి దానాలు చెయ్యడం కంటే చిన్న మొత్తాలు ఇచ్చి తన పేరు కనపడే విధంగా, వినపడే విధంగా చూసుకునేవారు సుందర్రావు గారు.
అలా ఆయన మళ్ళీ వెలుగులోకి రావడం మొదలయింది. ప్రతి సేవా సంస్థ కూడా ఆయన ముందు చెయ్యి చాచేవారే అయ్యారు.
ఆయన ప్రాభవం మళ్ళీ పెరగడం మొదలయింది. మళ్ళీ తనకు గుర్తింపు రావడం వల్ల ఆయన దగ్గర దానాలు తీసుకున్న సంస్థలకు మాత్రమే వెళ్ళేవాడు తన ప్రాభవం చూసుకుని మురిసిపోవడానికి.
రోజులు అలా జరుగుతుండగా సుందర్రావు గారు ఒక రోజు బజారుకు వెళ్ళి అరటి పళ్ళు తీసుకుందామని ఒక తోపుడు బండి దగ్గరకు వచ్చి బేరం ఆడారు.
డజను అరవై రూపాయలని చెప్పింది ఆ అరటి పళ్ళు అమ్ముకునే ఆడ కూతురు.
యాభైకి అడిగారు సుందర్రావు గారు.
'తీసుకోండి అయ్యగారు' అంటూ ఒక హస్తం తీసి లెక్కపెట్టి పన్నెండు అరటి పళ్ళు ఆయనకిచ్చింది. హస్తంలో మరొక మూడు మిగిలిపోయాయి.
'ఆ మూడు కూడా వేసేయ్' అన్నారు సుందర్రావు గారు.
ఇంతలో చంకలో బిడ్డను పెట్టుకుని అడుక్కునే మనిషి వచ్చింది చెయ్యి చాస్తూ ....
ఆ తోపుడు బండి ఆడ కూతురు సుందర్రావు గారి వైపు చూసి ఆ మూడు పళ్ళను ఆ అడుక్కునే మనిషికి వేసింది.
'నా తల్లి చల్లగా ఉండమ్మా' అంటూ సగమే ఉన్న ఎడం చేతిలో బిడ్డను పట్టుకుని కుడి చేత్తో ఒంటి దణ్ణం పెట్టి వెళ్ళిపోయింది ఆ అడుక్కునే అమ్మాయి.
ఒక్కసారిగా సుందర్రావు గారికి ఆ తోపుడు బండి ఆడ కూతురు చూపు చురుగ్గా తగిలింది.
"ఆ మూడు పళ్ళతో నా ఆస్తేమీ తరిగిపోదు కదా? తిండి లేని వాళ్ళకు ఒక అరటి పండు ఇవ్వడంకంటే పున్నెమేముంటదయ్యగారు?" అనుకుంటూ వెళ్ళిపోయింది అరటి పళ్ళు అమ్మే ఆడ కూతురు.
మొదటిసారిగా ఆలోచనలో పడ్డారు సుందర్రావు గారు.
'ఆ చూపులో ఎంత అర్ధం ఉంది? ఆ ముష్టిదానికి, నాకు తేడా లేదు కదా? తను ఇంత కాలం ఏ దానం చేసినా పేరు కోసం చేసాడు.
కానీ ఆ అరటి పళ్ళు అమ్ముకునే ఆడది ఏమీ ఆశించకుండా తనకు చేతనైన సహాయం చేసిందే? మరి తను? ఆ మూడు అరటి పళ్ళను ఉచితంగా ఆశించాడే?
'ఆ మూడు పళ్ళతో నా ఆస్తేమీ తరిగిపోదు కదా?'
ఎంత విలువైన మాట? చేసిన దానం చిన్నది అయినా ఎంత గొప్పగా చేసింది?
ఆలోచిస్తూ ఇంటికి వస్తున్న సుందర్రావు గారికి ఎదురు పడ్డాడు అదే ఆఫీసులో పని చేసే టెంపరరీ కుఱ్ఱాడు సత్యం.
"నమస్తే సార్ .... " అంటూ చేతులు జోడించాడు సత్యం.
"ఏం సత్యం, బాగున్నావా?" అంటూ పలకరించారు సుందర్రావు గారు.
"కొత్త సారు వచ్చాక మా టెంపరవరీ వాళ్ళని తీసేసారండి" అన్నాడు సత్యం.
"అయ్యో, అలాగా?" మొదటిసారిగా తన మాటలో జాలి వినిపించింది సుందర్రావు గారికి.
"ఔను సార్ .... ఏక్కడైనా పనుంటే ఇప్పించండి సార్ .... " అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు సత్యం.
ఒక్క నిముషం సుందర్రావు గారిలోని 'సుందరం' ఆలోచించాడు.
"సత్యం .... టెంపరరీ వాళ్ళు ఎంత మంది ఉన్నారు?" అనడిగారు సుందర్రావు గారు.
"నేను, శివ మిగిలాం సార్. మిగతా వాళ్ళు వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిపోయారు" అని చెప్పాడు సత్యం.
"సరే .... సాయంత్రం ఇంటికి రండి" అంటూ ముందుకు కదిలారు సుందర్రావు గారు.
మూడు రోజుల తరువాత అదే ఆఫీస్ ముందు రెండు తోపుడు బళ్ళు నిలబడి ఉన్నాయి.
'సత్యం ఫ్రూట్ స్టాల్'
'శివం ఫ్లవర్ స్టాల్'
'సుందరం' గారు మాత్రం అక్కడ ఉండదలచుకోలేదు.