-->

Story 03 | పెద్దల మాట చద్ది మూట | prudhviinfoపెద్దల మాట చద్ది మూట 

రామాపురంలో నివసించే నిర్మలమ్మ.. వయసు ఎనభై ఏళ్లు దాటినా ఎంతో చురుగ్గా ఉంటుంది. కళ్లు సరిగ్గా కనబడకపోయినా తన పనులు తాను చేసుకుపోతుంది. పట్నంలో ఉండే ఆమె మనవరాలు పద్మ, దసరా సెలవుల్లో తన పదేళ్ల కొడుకు రాముతో కలసి నిర్మలమ్మ దగ్గరకు వచ్చింది.

   ఆ ఇంట్లో అందరూ ఏ పని చేయాలన్నా.. నిర్మలమ్మ సలహా తీసుకోవడం చూసి, రాముకు ఆశ్చర్యం కలిగింది. అదేమాట తన తల్లికి చెప్పాడు. 'అవ్వ బాగా ముసలిదైపోయింది కదమ్మా! ఆమె టీవీ చూడదు. సెల్‌ఫోన్ వాడదు. చదువుకోలేదు. ఎలాంటి జ్ఞానమూ లేదు.. అయినా ఇక్కడ అందరూ ప్రతి దానికి ఆమె సలహా ఎందుకు తీసుకుంటారు?' అని అడిగాడు.

   'పెద్దల మాట చద్ది మూట' అంటారు కదా... అంటే పెద్దవాళ్లు ఏది చెప్పినా తమ అనుభవంతో చెబుతారని అర్ధం' అంది పద్మ. 'ఆ మాట చెప్పింది కూడా పెద్దలే కదా! తమమాట చెల్లుబాటు కావాలని అలా చెప్పి ఉంటారమ్మా' ఎగతాళిగా అన్నాడు రాము. 'కొన్ని రోజులు బామ్మతో ఉంటే ఆమె గొప్పతనం ఏంటో నీకే తెలుస్తుంది. ఈ రోజు అవ్వ ఏదో పని మీద పక్క ఊళ్లో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళుతోంది. ఆమెకు కళ్లు సరిగా కనపడవు కదా! నువ్వు ఆమెకు తోడుగా వెళ్లు' అంది పద్మ. 

  తర్వాత రాము అవ్వ వెంట బస్సులో పక్క ఊరుకు బయలుదేరాడు. ఆ గ్రామానికి వెళ్లాలంటే బస్సు దిగి కొంత దూరం నడవాలి. బస్సు దిగాక రాము తన అవ్వతో కలిసి కాలి బాట పై నడవసాగాడు. కొద్ది దూరం వెళ్లాక దారి పక్కన ఓ చెట్టు కనిపించింది. దాని నిండా ఎర్రటి పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. కొన్ని పండ్లు రాము చేతికి  అందే ఎత్తులోనే ఉన్నాయి.  

    బామ్మా! ఇవేం పండ్లు? " అని అడిగాడు రాము. నిర్మలమ్మ 'నాకు తెలీదురా. పైగా నాకు కళ్లు సరిగా కనపడవు కదా!' అంది నిర్మలమ్మ. 'ఈ ఎర్రటి పళ్లను చూస్తుంటే నాకు నోరూరుతోంది బామ్మా. గుత్తులు గుత్తులుగా చెట్టంతా ఉన్నాయి. పైగా నా చేతికి అందేంత ఎత్తులోనే ఉన్నాయి' అంటూ రాము చెయ్యెత్తి ఓ పండును తెంపబోయాడు. 

   నిర్మలమ్మ వద్దని వారిస్తూ.. 'ఈ పండ్లు చేదుగా ఉంటాయిరా. తినొద్దు' అంది. 'ఈ పండ్ల గురించి నీకు తెలియదన్నావు. మరి చేదుగా ఉంటాయని ఎలా చెప్పగలవు? " అంటూ రాము అవ్వ మాటల్ని పట్టించుకోకుండా ఓ పండు తెంపి ఆబగా నోట్లో పెట్టుకుని కొరికాడు. వెంటనే ఉమ్మేస్తూ ముఖం చిట్లించాడు. 

   'ఈ పండ్లు నిజంగానే చేదుగా ఉన్నాయి బామ్మా!' అన్నాడు. 'నేను ముందే చెప్పాను కదా' అని నిర్మలమ్మ ముసిముసిగా నవ్వుతూ అంది. తర్వాత వాళ్లిద్దరూ నిర్మలమ్మ స్నేహితురాలి ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి పెరట్లో కూడా కాస్త అలాంటి ఎర్రటిపండ్లున్న చెట్టే కనిపించింది. ఆ సంగతి బామ్మకు చెప్పాడు రాము. కుశల ప్రశ్నల తర్వాత నిర్మలమ్మ స్నేహితురాలు ఆ చెట్టు పండ్లు కోసుకొచ్చి రాముకిచ్చింది. రాము ఆ పండ్లను తినడానికి భయపడ్డాడు. అప్పుడు నిర్మలమ్మ 'ఫర్వాలేదు.. తిను. ఈ పండ్లు తియ్యగా ఉంటాయిలే' అంది. రాము భయపడుతూనే ఒక పండు కాస్త కొరికి చూశాడు. నిజంగానే అది తియ్యగా ఉంది. అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆబగా పండ్లన్నీ తినేశాడు.

    తర్వాత తిరుగు ప్రయాణంలో... 'అవ్వా దారిలోని చెట్టు పండ్లు చేదుగా ఉంటాయని, పెరట్లోని చెట్టు పండ్లు తియ్యగా ఉంటాయని నీకెలా తెలిసింది?' అని రాము నిర్మలమ్మను అడిగాడు. నిర్మలమ్మ చిరునవ్వు నవ్వి.. 'తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు.. అనుకోకూడదు. చూడ్డానికి ఒకేలా కనిపించే పండ్లలో కూడా చేదు పండ్లు, తియ్యని పండ్లు ఉండొచ్చు. జనం తిరిగే దారిలో ఉన్న చెట్టుకు గుత్తులు గుత్తులుగా పండ్లు వేలాడుతున్నా.. అవి చేతికి అందే ఎత్తులోనే ఉన్నా  ముట్టడం లేదంటే అవి తినడానికి పనికిరావని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అలాంటి చెట్టును ఎవరూ పెరట్లో పెంచరు కదా! కానీ అలాపెంచుతున్నారంటే అది మొదటి చెట్టు లాంటిది కాదు. తియ్యటి పండ్లు ఇచ్చే చెట్టు అని అర్ధమైంది. అందుకే ఆ పండ్లు తినమని చెప్పాను' అంది. 

   కళ్లు సరిగ్గా కనపడకపోయినా తర్కం, జీవితానుభవంతో అవ్వ చెప్పిన మాట విని జ్ఞానోదయమైంది. 'పెద్దల మాట చద్ది మూట' అని ఎందుకు చెప్పారో చక్కగా అర్థమైంది.
PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT