కోతి.. కొత్త నైపుణ్యం!
అనగనగా ఒక అడవి. అందులో ఒక మామిడి చెట్టు పైన ఒక కోతి, కొంగ స్నేహంగా ఉండేవి. కోతి ఇతరుల నుంచి కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటుండేది. కొంగ చేపల్ని ఓర్పుగా, నేర్పుగా పట్టి తింటూ కోతితో కాలక్షేపం చేస్తుండేది. ఒకరోజు కోతి, కొంగ కబుర్లు చెప్పుకుంటుండగా ఎలుగుబంటి రావడం గమనించింది. కోతి.
'ఏంటి ఎలుగు మామా! ఎటో పోతున్నావు" అని పలకరించింది కోతి. 'ఆ చింతచెట్టు మీద పే..ద్ద తేనెపట్టు ఉంది. తేనె తీసుకురావడానికి వెళుతున్నాను అల్లుడూ..' అంది ఎలుగుబంటి. తేనె అనగానే కోతికి నోరూరింది. వెంటనే కొమ్మ మీద లేచి కూర్చుంది. ఒక్క గెంతులో కిందకు దూకింది.
'ఎలుగు మామా.. ఎలుగు మామా! తేనెపట్టు నువ్వు భలే తీస్తావు. ఆ విద్య నాకూ నేర్పవా' అంది కోతి. తనతో వస్తే తప్పకుండా నేర్పిస్తానంది. ఎలుగుబంటి. కొంగనూ తన వెంట రమ్మంది కోతి. కానీ అది ఆసక్తి చూపలేదు. దాంతో కోతి మాత్రమే ఎలుగుబంటి వెంట వెళ్లింది. మరోసారి కోతి, కొంగ ముచ్చట్లు చెప్పుకుంటుండగా చెరువు ఒడ్డుకు ఒక పే..ద్ద చేప వచ్చింది. 'ఏంటి చేపన్నా.. ఎలా ఉన్నావు' అని పలకరించింది. కోతి. 'మీ వదిన మామిడి పండు అడిగింది తమ్ముడూ' అంది ఆ చేప. కొన్ని తియ్యటి పళ్లు కోసి చేపకు అందించింది. కోతి. కన చేపన్నా.. చేపన్నా.. నువ్వు నీటిలో చక్కగా ఈదగలుగుతావు. నాకూ కాస్త ఈత నేర్పవూ' అనడిగింది కోతి. దాని ముచ్చట చూసి సరేనంది చేప. కొంగను కూడా రమ్మంది కోతి. కొంగ కదలేదు. కోతి, చేప వెంట వెళ్లి ఈత నేర్చుకుంది. మరోసారి కోతి, కొంగ ఆడుకుంటుండగా దాహం తీర్చుకోవడానికి చెరువుకు వచ్చింది నెమలి.
'నెమలీ: నెమలీ! నువ్వు పురివిప్పి ఎంతో గొప్పగా నాట్యం చేస్తావు. నాకూ కొత్త నైపుణ్యం నేర్పుతావా' అని అడిగింది కోతి. 'ఓ.. తప్పకుండా.. నేర్పిస్తా' అంది నెమలి. కొంగను కూడా నేర్చుకోమంది కోతి. కొంగ మాత్రం ఓ నవ్వు నవ్వి ఊరుకుంది. ఒకరోజు కోతి, కొంగ మృగరాజు పుట్టినరోజు వేడుకకు వెళ్లాయి. గొప్ప విందుతోపాటు కోకిలమ్మ పాటకచేరి ఏర్పాటు చేసింది సింహం. కానీ కోకిలమ్మకు నలతగా ఉండి పాడలేకపోయింది. పక్క అడవి రాజు పులి ఆ వేడుకకు అతిథిగా వచ్చాడు. దాంతో మృగరాజు కంగారు పడింది. కోతి వెంటనే వేదికనెక్కింది. చక్కగా పాటలు పాడింది. ఆ పాటలకు పులి ఆనందంతో నృత్యమూ చేసింది. వేడుకకు వచ్చిన జీవులన్నీ కోతిని అభినందించాయి. మృగరాజు ఎంతో సంతోషించి కోతిని సత్కరించి బోలెడు కానుకలిచ్చి పంపింది. దారిలో 'మిత్రమా! నీకు పాడటం ఎలా వచ్చింది' అని అడిగింది. కొంగ. ఒకసారి కోకిలమ్మ మన మామిడి చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు నేర్పింది' అని చెప్పింది కోతి. ప్రతి జీవిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఇతరుల నుంచీ కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే మనకే మంచిది అని తెలుసుకుంది. కొంగ. పైడిమర్రి రామకృష్ణ