-->

story 14 | నిజమైన స్నేహం | pruhviinfoనిజమైన స్నేహం!

అనగనగా ఓ అడవి. అందులో ఒక చిన్న చెరువు ఉండేది. దాని పక్కనే ఓ చెట్టు, దాని కొమ్మకు ఓ గిజిగాడు గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది. చెట్టుకున్న ఒక సన్నని కొమ్మకు గిజిగాడి గూడు ఉండేది. ఆ కొమ్మ చెరువు వైపు వేలాడుతూ ఉండేది. ఆ పక్కనే ఉన్న పుట్టలో నాగుపాము, చెరువులో మొసలి నివశించేవి. ఈ రెండూ గిజిగాడితో నవ్వుతూ మాట్లాడుతూ స్నేహం చేస్తున్నట్లు నటించేవి. కానీ వాటి దృష్టంతా గిజిగాడి గూడు పైనే ఉండేది. గిజిగాడి పిల్లల్ని గుటుక్కున మింగే అవకాశం కోసం ఆ రెండూ ఎదురు చూస్తూ ఉండేవి. పాపం వాటి స్నేహాన్ని నమ్మిన గిజిగాడు, తన గూడును జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పి ఆహారం కోసం వెళ్లేది. తర్వాత పాము, మొసలి గిజిగాడి గూడును అందుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసేవి. గూడును అందుకునే క్రమంలో చాలాసార్లు సన్నటి కొమ్మ పై నుంచి పాము జారిపోయేది. మొసలి కూడా నీళ్లలో నుంచే అందుకోవడానికి ప్రయత్నం చేసినా నిరాశే ఎదురయ్యేది. ఏదో ఒకనాడు గూడు తమకు అందటం ఖాయమని, అప్పుడు గిజిగాడి పిల్లలను మింగేయొచ్చు అని ఆశగా ఎదురు చూసేవి పాము, మొసలి. గిజిగాడు తిరిగి గూడును చేరగానే నవ్వుతూ గిజిగాడిని పలకరించేవి అవి. తనకు మంచి స్నేహితులు దొరికారు అని గిజిగాడు సంతోషించేది. ఒక రోజు ఓ గుడ్లగూబ చెట్టుపై వాలింది. దాన్ని చూడగానే గిజిగాడికి భయమేసింది. గుడ్లగూబ, గిజిగాడుతో..

 మిత్రమా.. నేను ఈ అడవికి కొత్త. ఇక నుంచి ఈ చెట్టే నాకు నివాసం. ఈ రోజు నుంచి మనం స్నేహితులుగా ఉందాం' అంది. పెద్ద కళ్లతో భయంకరంగా ఉన్న గుడ్లగూబను చూస్తే భయం వేసింది గిజిగాడికి. తన పిల్లల్ని ఎక్కడ తినేస్తుందో అనే భయం పట్టుకుంది. 'ఓ గుడ్లగూబా.. నిన్ను చూస్తే భయం వేస్తోంది. నువ్వు భయంకరంగా ఉన్నావు. నేను నీతో స్నేహం చేయలేను. దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపో' అంది గిజిగాడు.

 'సరే మిత్రమా..! నేను ఓ రెండు రోజులు ఇక్కడే ఉండి, మరో నివాసం దొరికిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిపోతాను' అంది. మరుసటి రోజు అడవిలో పెద్ద వర్షం మొదలైంది. వానకు గాలి తోడు కావడంతో అడవి అంతా అల్లకల్లోలంగా ఉంది. గిజిగాడి పిల్లలు ఆహారం కోసం అరుస్తున్నాయి. గిజిగాడు.. పాము, మొసలిని పిలిచి 'మిత్రులారా.. నేను ఆహారం కోసం వెళుతున్నాను. కాస్త పిల్లలను చూస్తూ ఉండండి. గుడ్లగూబ కదలికల్ని కని పెట్టుకుని ఉండండి. అది నా పిల్లల్ని తినేయగలదు' అని అంది. అందుకు మొసలి, పాము ఇలా బదులిచ్చాయి... 'మిత్రమా.. నువ్వేం భయపడకు. నీ పిల్లలకు మా ప్రాణం అడ్డేస్తాం. వర్షంలో జాగ్రత్త', గిజిగాడు వెళ్లిపోగానే గూడును అందుకోవడానికి పాము, మొసలి తీవ్ర ప్రయత్నం చేశాయి. గాలి వేగం పెరగడంతో గూడు జారి పడబోయింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న పాము, మొసలి గిజిగాడు పిల్లల్ని తినడానికి పరుగులు పెట్టాయి. ఈ దృశ్యాన్ని చూసిన గుడ్లగూబ క్షణం ఆలస్యం చేయకుండా ఎగిరి గిజిగాడి గూడును కాళ్లతో అందుకుని చెట్టుపై క్షేమంగా భద్రపరిచింది. నోటిదాకా వచ్చిన తిండి దొరక్కపోయేసరికి పాము, మొసలి నిరాశగా వెనక్కి వెళ్లిపోయాయి. వర్షం తగ్గాక గిజిగాడు చెట్టు దగ్గరకు చేరుకుంది. తన గూడు కనబడకపోయేసరికి కంగారు పడింది. 

  'అయ్యో నా పిల్లలు ఏమయ్యాయి? గుడ్లగూబ ఏమైనా నా పిల్లలను తినేసిందా? ' అని బోరున విలపించింది. చెట్టుపై ఉన్న గుడ్లగూబ. . 'మిత్రమా! నీ పిల్లలు నా దగ్గర క్షేమంగా ఉన్నారు. ఇదిగో చూడు' అంటూ గూడును చూపించింది. గిజిగాడు చాలా సంతోషించింది. జరిగిన విషయం అంతా గుడ్లగూబ చెప్పింది. మంచితనం నటిస్తూ మోసం చేసిన మొసలి, పాము అసలు బుద్ధి తెలిసిన తర్వాత గిజిగాడికి వాటిపై అసహ్యం కలిగింది.

  'మిత్రమా.. నన్ను క్షమించు. నీ ఆకారాన్ని చూసి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మంచితనం, నిజాయతీ అనేది ఆకారాన్ని బట్టి ఉండదని నిన్ను చూశాక అర్ధమైంది. ఇక నుంచి మనిద్దరం స్నేహితులం' అని గుడ్లగూబతో అంది గిజిగాడు. 'నన్ను స్నేహితుడిగా అంగీకరించినందుకు కృష్ణతలు. ముందు నీ పిల్లలకు ఆహారం అందించు' అంది గుడ్లగూబ. పిల్లలకు ఆహారం అందించిన తర్వాత దుష్టులైన స్నేహితుల మధ్య ఉండలేక మరొక సురక్షిత ప్రాంతానికి అవి వెళ్లిపోయాయి.
PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT