-->

story 19 | ఎలుగుబంటి సాయం | prudhviinfo ఎలుగుబంటి సాయం

ఒక అడవిలో పొగరుబోతు ఎలుగుబంటి ఉండేది. ఎవ్వరితోనూ సరిగా మాట్లాడేది కాదు. అవసరమొచ్చి ఎవరైనా సాయం అడిగినా.. కసిరేది తప్ప చేసేది కాదు. ఒకసారి అది పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి ఆహారం తేవడానికి వెళ్లింది. పెద్ద చెరకు తోటలో దిగి కడుపు నిండా తినేసి, పిల్లల కోసం ఒక మోపు కట్టింది. దాన్ని మోసుకుంటూ వెళ్తుంటే.. రక్షించమని ఎవరో వేసిన కేకలు వినిపించాయి. 

   కేకల్ని విననట్టే ముందుకు నడిచింది ఎలుగుబంటి. మళ్లీ రక్షించమని పెద్దగా కేకలు వినిపించాయి. 'ఎవరు పిలిస్తే నాకేంటి? అరిస్తే నాకేంటి? అవతల నా పిల్లల ఆకలి తీర్చాలి' అనుకుని ముందుకే అడుగేసింది. ఎలుగుబంటి. ఈసారి మరింత దీనంగా కేకలు వినపడ్డాయి. ఎలుగుబంటికి ఇక ఆగక తప్పలేదు. కేకలెవరివో చూసి వెళ్లిపోదామనుకుంది. శబ్దం వచ్చిన వైపు వెళ్లింది. అక్కడ ఊబిలో కూరుకుపోయిన ఒక జింక కనబడింది. దానికి. ఎంత ప్రయత్నిస్తున్నా సరే అందులోంచి రాలేక ప్రాణ భయంతో అది అరుస్తోంది. 

 ఎలుగుబంటిని చూడగానే చిన్న ఆశ కలిగింది. జింకకు. అంతలోనే అదెవరికీ సాయం చెయ్యదని గుర్తొచ్చింది. కానీ బతుకు మీదున్న తీపితో సాయం చెయ్యమని ఎలుగుబంటిని అడిగింది. 'అవతల నా పిల్లలకు తిండికిఆలస్యమవుతోంది. తొందరగా వెళ్లాలి' అని బయల్దేరబోయింది ఎలుగుబంటి. 'నా పిల్లలు కూడా నాకోసం చూస్తుంటాయి. ఏమీ తెలియని వయసు వాటిది. తల్లిలేని పిల్లల బతుకెంత కష్టమో తెలియంది కాదు నీకు. 

 నేను బయట పడేలా సాయం చెయ్యి' అని బతిమాలింది జింక.. ఎలుగుబంటి చిరాకు పడుతూ.. 'ఊబిని చూసుకోవద్దా? నిన్ను రక్షించడం తప్ప పనేమీ లేదనుకున్నావా? ' అని కసురుకుంది. మళ్లీ జింక బతిమాలేసరికి మోపు కింద పెట్టి చుట్టూ చూసింది ఎలుగుబంటి. కొంచెం దూరంలో తాడు కనబడితే అక్కడకు వెళ్లింది.

  గట్టు మీదున్న రైతు పనిముట్లలోని బలమైన తాడును అందుకుంది. దాంతో ఊబిలోని జింకను బయటపడేలా చేసింది. బయటకు వచ్చిన జింక ఎలుగుబంటికి ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పింది. సర్లే.. నీ పొగడ్తలు ఆపు. అవతల నా పిల్లలకు తిండి ఆలస్యమవుతోంది' అని విసుక్కుంటూ వెళ్లిపోయింది. ఎలుగుబంటి. ఇంటికి వెళ్లేసరికి దొడ్లో కుందేలు, గాడిద, ఏనుగు మొదలైన జంతువులు కనబడ్డాయి.

   చెరకు గడలు తెస్తున్నట్లు వీటికి తెలిసిపోయిందేమో. ఒక్కటి కూడా ఇవ్వను. ఇవన్నీ నా పిల్లలకే అనుకుంది ఎలుగుబంటి. దారిలో ఉన్న జంతువుల్ని పక్కకు తప్పుకోమని కసురుకుంటూ ముందుకు వెళ్లింది ఎలుగుబంటి. అక్కడ కింద పడి ఉంది. దానిపిల్ల. దాని కాలికి ఏదో పసరు రాస్తోంది కొంగ. అది చూసి కంగారు పడిన ఎలుగుబంటి 'నా పిల్లకు ఏమైంది. పసరు ఎందుకు రాస్తున్నావు?' అని అడిగింది. 

  'ఇది బయట ఆడుకుంటుంటే పాము కాటేసింది. అది చూసిన కోతి మా అందరితో చెప్పింది. సమయానికి నువ్వు ఇంట్లో లేవు కదా. వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం. అందుకే మేమంతా వచ్చాం. కొంగకు వైద్యం తెలుసని కుందేలు చెప్పడంతో చిలుక వెళ్లి పిలుచుకు వచ్చింది. విషానికి విరుగుడు ఆకులు వెతికింది బాతు. వాటిని నూరి పసరు రాస్తోంది కొంగ. ఇంతలో నువ్వొచ్చావు' అని జరిగిందంతా చెప్పింది ఏనుగు. 'అయ్యో! నా పిల్లను మీరు కాపాడారా? మీరే లేకపోతే అది బతికేది కాదు. మీకెప్పుడూ ఏమీ చేయకపోయినా కూడా అవేమీ మీ మనసులో పెట్టుకోకుండా కాపాడారు' అంది ఎలుగుబంటి.

  అప్పుడే అక్కడకు వచ్చిన జింక 'నువ్వేమీ చేయకపోవడమేంటి? ఇప్పుడే నన్ను ఊబిలో నుంచి కాపాడావు. నువ్వక్కడ నన్ను కాపాడితే.. ఇక్క నీ పిల్లను. వీళ్లు కాపాడారు. అంతే! అంది. మిగతా జంతువులు ఎలుగుబంటి చుట్టూ చేరి జింకను కాపాడినందుకు అభినందించాయి. 'నీలోనూ మార్పు వచ్చింది. సాయం చేయడానికి ముందుకు రాని నువ్వు ఈ రోజు జింకను కాపాడావు. తెలిసో తెలియకో మనమెవరికైనా సాయం చేస్తే మరో రూపంలో మనకు తిరిగి సాయం అందుతుందని అమ్మ చెప్పేది. అది ఇప్పుడు రుజువైంది' అంది చిలుక. 

   'నిజమే. నేను విసుక్కుంటూనే జింకను రక్షించాను. కానీ చేసిన సాయం ఊరికే పోలేదు. మీ రూపంలో నా పిల్ల ప్రాణాలు కాపాడింది' అంది ఎలుగుబంటి. 'అడవిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఆపదలు వస్తుంటాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనల్ని మనమే కాపాడుకోవాలి. అవసరంలో ఉన్నవారికి సాయపడమని పిల్లలకు కూడా చెప్పాలి' అంది ఏనుగు. అవును అన్నాయి జంతువులన్నీ. నారంశెట్టి ఉమామహేశ్వరరావు


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT