నాయకుడి లక్షణం!
Attribute of a leader
అనగనగా ఓ అడవి. అందులో పెద్దపులి, సింహం ఉండేవి. అవి అడవిని రెండు భాగాలుగా విభజించుకుని రెండూ రాజ్యపాలన చేసేవి. రెండింటి బలం దాదాపు సమానం. పైగా రెండింటికీ విరోధం ఉండేది. ఏదో రకంగా శత్రువు అడ్డు తొలగించుకొని పక్క రాజ్యాన్ని కూడా ఆక్రమించుకుని మొత్తం అడవంతటికీ తానే రారాజు అవ్వాలని ఓ వైపు పెద్దపులి, మరో వైపు సింహం.. రెండూ కలలు కనేవి.
ఒక రోజు ఓ జిత్తులమారి నక్క సింహాన్ని కలిసి వినయంగా నమస్కరించింది. 'మహారాజా! మీరు అడవి మొత్తానికి రారాజుగా మారే గడియ సమీపించింది. ఏ యుద్ధం లేకుండా అతి తేలికగా పెద్దపులి రాజ్యం మీ వశమవుతుంది' అని చెప్పింది. 'అవునా! ఎలా? ' అని అడిగింది సింహం ఆసక్తిగా. 'అడవిలో ఒక వేటగాడు ధనుర్బాణాలు, వల, ఉచ్చు మొదలైన వాటితో తిరుగుతూ కనిపించాడు. దిక్కుమాలిన పులిని వేటగాడి వలలో చిక్కేలా చేస్తా. వాడి వేటకుక్కలతో కూడా నాకు పరిచయం ఉంది. నాలుగు మాయమాటలు చెప్పి పులిని వేటగాడు వలపన్నిన చోటుకు తీసుకువస్తాను. ఒక్కసారి వలలో చిక్కితే దాన్ని ఇక ఎవరూ కాపాడలేరు' అంది నక్క
అడవిలో వేటగాడు తచ్చాడుతున్నట్లు సింహానికి అప్పటికే తెలుసు. పులిని వాడికి బలిచేస్తే తన కలనెరవేరినట్లే అని ఊహల్లో తేలిపోయింది. సింహం. 'మరి.. ఈ పని చేసినందుకు ఇరవై కిలోల జంతుమాంసం మీరు నాకు బహుమతిగా ఇవ్వాలి. ఇందులో కొంత వేటకుక్కలకు కూడా నేను ఇచ్చుకోవాల్సి ఉంటుంది' అంది నక్క. 'ఓ.. తప్పకుండా' అంది. సింహం. 'మహారాజా! ఒక్క నిమిషం' అంది పక్కనే ఉన్న మంత్రి ఏనుగు. ఏంటో చెప్పమన్నట్లు చూసింది సింహం. 'ఈ నక్క అసలే జిత్తులమారిది. దీన్ని నమ్మి ఇలాంటివి చేయడానికి ముందడుగు వేయడం మంచిది కాదు' అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. 'ఏం ఫర్లేదు. ఇందులో మనం నష్టపోయేది ఏం లేదు. ఇరవై కిలోల మాంసం తప్ప' అని చిరాగ్గా అంది సింహం. నక్క సింహం దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయింది.
మరునాడు నక్క సింహాన్ని కలిసి 'మహారాజా! మీకో శుభవార్త. నా శ్రమ ఫలించింది. పులి వేటగాడి వలలో పడిపోయింది. బాధగా అరుస్తోంది. ఇంకో అరగంటలో వేటగాడు వచ్చి దాన్ని చంపేస్తాడని వేటకుక్కలు సమాచారం కూడా ఇచ్చాయి. మీరు పులిని చివరిసారిగా చూడాలనుకుంటే వెంటనే రండి' అని చెప్పింది ఆనందంగా, చావు భయంతో గింజుకుంటున్న పులిని చూసి విజయగర్వంతో నవ్వాలని హడావిడిగా బయలుదేరింది. సింహం. ఏనుగు ఏదో చెప్పబోతుంటే గట్టిగా విసుక్కుంది. తన రాజ్యం విస్తరించాక ముందు ఈ అపశకునపు ఏనుగును వదిలించుకోవాలి అనుకుంది. మనసులో.
పులిని చూద్దామని నక్క తీసుకువెళ్లిన చోటుకు ముందూ వెనకా చూసుకోకుండా ఆత్రంగా వెళ్లిన సింహం ఊహించని విధంగా తానే వేటగాడి వలలో పడిపోయింది. వేటకుక్కలు కూడా చుట్టుముట్టాయి. దూరంగా వేటగాడు వస్తున్న అలికిడి కూడా వినిపించింది. వలలో చిక్కిన సింహం గింజుకుంటూ తన దుస్థితికి కారణమైన నక్కను నిందించసాగింది.
' గొప్ప రాజనుకునే సింహమా! నీ దుస్థితికి కారణం నేను కాదు. నువ్వే నాయకుడైన వాడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. తన హితవు కోరి చెప్పేవారి సలహా విని, బాగా ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకానీ అన్నీ నాకే తెలుసునని విర్రవీగి నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుంది. నీకు మాయమాటలు చెప్పి వేటగాడి వలలో చిక్కేలా చేస్తానని పులి దగ్గర అరవై కిలోల మాంసం బేరం కుదుర్చుకున్నాను' అంది నక్క
'అయ్యో.. ఎంత పనిచేశావు. నన్ను అడిగితే ఆ అరవైకిలోల మాంసమేదో నేనే ఇచ్చేదాన్నిగా' అంది సింహం. 'పులి నీలా అన్నీ తనకే తెలుసనుకునే మూర్ఖపు రాజు కాదు. నేను ఎన్ని జిత్తుల మారి వేషాలు వేసి దాన్ని నమ్మబలికినా, తన మంత్రులతో చర్చించి కానీ అది ఓ నిర్ణయానికి రాదు. అందుకని దాన్ని వలలో పడేలా చేయడం జరిగేపని కాదు. నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అనుభవించు' అని తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయిందినక్క, తనకు దొరకబోతున్న మాంసాన్ని తలుచుకుంటూ..