తన కోపమే తన శత్రువు
బాహుదా నదీ తీరంలో ఒక వనం ఉండేది. అందులో ఓ కుందేలు నివసించేది. అది చక్కగా వైద్యం చేసేది.అస్వస్థతతో వచ్చే జంతువులు, పక్షులకు వైద్యం చేస్తూ.. మంచి హస్తవాసిగల వైద్యుడిగా పేరు తెచ్చుకుంది. వైద్యంలో చేదోడు వాదోడుగా ఉంటూ, ఒక కొంగ కుందేలు దగ్గర వైద్యం నేర్చుకుంది. వైద్యం కోసం వచ్చే జంతువులు, పక్షుల పై కొంగ అప్పుడప్పుడు కోపంగా అరిచేది. వాటిపై చిరాకు పడేది.
'అలా వైద్యం కోసం వచ్చే వాళ్ల పై చిరాకు పడటం, వాళ్ల మీద అరవడం తప్పు' అని కుందేలు కొంగతో చెప్పింది. కానీ కొంగ వినేది కాదు. 'గురువుగారూ! మీకు ఏమీ తెలియదు. మీరు ఊరుకోండి' అంటూ కుందేలుకే ఎదురు చెప్పేది కొంగ. కొన్ని రోజులకు కొంగ కూడా చక్కగా వైద్యంలో మెలకువలు నేర్చుకుని గురువుకు తగ్గ శిష్యుడు అనే పేరు తెచ్చుకుంది. సొంతంగా వైద్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంగ దగ్గరకు ఒకసారి వైద్యానికి వచ్చిన జంతువులు కానీ, పక్షులు కానీ మరోసారి వచ్చేవి కాదు.
కుందేలు దగ్గరకు వెళ్లిపోయేవి. ఎందుకలా జరుగుతుందో కొంగకు అర్ధం కాలేదు. తన దగ్గరికి వైద్యం కోసం వచ్చేవారికి చక్కగా నయం చేస్తున్నా... వాళ్లు మరోసారి జబ్బు చేసినప్పుడు తన దగ్గరకు రాకపోవడానికి కారణం ఏంటి? అని ఆలోచించసాగింది. తన వైద్యం మీద తనకే అపనమ్మకం కలిగింది. అలా చింతిస్తూ.. ఒకరోజు దిగులుగా కొలను ఒడ్డున నిలబడింది. అలా ఉన్న కొంగను తాబేలు పలకరించి 'మిత్రమా! ఎందుకు దిగాలుగా ఉన్నావు' అని అడిగింది. అప్పుడు కొంగ, తన బాధను తెలియజేస్తూ.. తన సందేహాన్ని నివృత్తి చేయమని కోరింది. అప్పుడు తాబేలు
'మిత్రమా! నువ్వు చేసే వైద్యాన్ని, నీ దగ్గరికి వైద్యం కోసం వచ్చేవారిని నేను నిత్యం గమనిస్తూనే ఉన్నా. నువ్వు చక్కగా వైద్యం చేస్తావు కానీ, నీకు కాస్త కోపం, చిరాకు ఎక్కువ. వైద్యం కోసం వచ్చేవారి పై అనవసరంగా చిరాకు పడుతూ ఉంటావు. నువ్వు వాళ్లతో ప్రవర్తించిన తీరుకు బాధపడుతూ రోగులు ఇంటికి వెళ్లడం నేను గమనించాను. అందుకే వాళ్లు రెండోసారి నీ దగ్గరకు రావడం మానేస్తున్నారు. నీ కోపమే నీకు శత్రువు నీ ఆగ్రహాన్ని నువ్వు అదుపులో పెట్టుకొని వైద్యం కోసం నీ దగ్గరకు వచ్చేవారితో ప్రేమపూర్వకంగా ప్రవర్తిస్తే, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు' అని కొంగలో లోపాన్ని చెప్పింది.
“మా గురువు గారు కుందేలు కూడా ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాలని చూసింది. కానీ నేనే పెడచెవిన పెట్టాను. ఇకపై వైద్యం కోసం వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తిస్తాను' అని కొంగ తాబేలుతో అంది. అనడమే కాదు తన ప్రవర్తనను మార్చుకొంది. కొద్ది రోజుల్లోనే ఆ వనంలో కుందేలుతోపాటు కొంగకూడా మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంది.