బీర్బల్ ఇక్కడ.. తగ్గేదేలే!
ఒకసారి అక్బరు ఓ అనుమానం వచ్చింది. "బీర్బల్ తెలివైనవాడే.. అందులో ఏ సందేహమూ లేదు. కానీ మునుపటి తెలివితేటలు ఇప్పుడు ఉన్నాయా? ఆస్థానంలో పదవికి బీర్బల్ యోగ్యుడేనా? " అనుకున్నాడు. 'అనుమానం రాకూడదు. . వస్తే దాని సంగతేంటో తేల్చేయాలి' అని ఓ నిర్ణయానికి వచ్చాడు. వెతకబోయే తీగ కాలికి తగిలింది అన్నట్లు... మరుసటి రోజే పక్క రాజ్యం నుంచి ఓ వ్యక్తి అక్బర్ కొలువుకు వచ్చాడు. అతడు అక్బ తో ' జహాపనా..! వందనాలు... నేను పక్క రాజ్యంలో అధికారిని. నేను మీ ఆస్థానంలోని బీర్బల్ తెలివితేటల గురించి విన్నాను. అతనికి నేనొక సమస్యను ఇవ్వాలనుకుంటున్నాను' అన్నాడు.
'మా బీర్బల్ ఎప్పుడూ సవాళ్లకు సిద్ధమే' అని అక్బర్ అన్నాడు. తర్వాత ఆ వ్యక్తికి రాచమర్యాదలతో విశ్రాంతి ఏర్పాటు చేశాడు. మరుసటి రోజు సభ కొలువు తీరింది. అప్పుడు ఆ వ్యక్తి ఓ గాజు కూజా తీసుకు వచ్చాడు. 'మహారాజా..! ఈ కూజాలో ఇసుక, పంచదార కలిసి ఉన్నాయి. వీటిని కరిగించకుండా రెండింటినీ వేరు చేయాలి' అన్నాడు. ఎప్పటిలానే అక్బర్ ఈ సమస్యను పరిష్కరించమని బీర్బల్ కు చెప్పాడు. ఒక్క నిమిషం ఆలోచించిన బీర్బల్, వ్యక్తిని, అక్బర్, మంత్రుల్ని సరే! నాతో రండి' అని చెప్పి తోటలోకి తీసుకువెళ్లాడు. ఒక మామిడి చెట్టు మొదట్లో ఓ వస్త్రాన్ని పరిచి అందులో కూజాలోని ఇసుక, పంచదార మిశ్రమాన్ని పోశాడు. 'అదేంటి.. అలా నేల మీద పారబోశారు. ఎందుకిలా చేశారు?' అని అడిగాడు ఆ పక్క రాజ్యం నుంచి వచ్చిన వ్యక్తి. 'ఎందుకిలా చేశానో.. రేపు ఉదయం చెబుతాను' అన్నాడు బీర్బల్. 'చూద్దాం.. ఏం చెబుతాడో అనుకున్న ఆ పరదేశీయుడు అప్పటికి సరే అన్నాడు. మరుసటి రోజు ఉదయం అంతా కలిసి ఆ మామిడిచెట్టు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ వస్త్రంలో కేవలం ఇసుక మాత్రమే ఉంది. పంచదార కనిపించలేదు.
'అదెలా సాధ్యమైంది' అన్నాడు పక్క రాజ్యం నుంచి వచ్చిన వ్యక్తి. దానికి బీర్బల్ ' రాత్రి పంచదారను చీమలు తీసుకెళ్లాయి. ఇప్పుడు ఇక ఇసుక మాత్రమే మిగిలింది. మీరన్నట్లు కరిగించకుండా రెండింటినీ వేరు చేశాను. మీరు పంచదారను చూడాలనుకుంటే మాత్రం నాకు సంబంధం లేదు. వెళ్లి చీమల్నే అడగండి' అన్నాడు బీర్బల్ నవ్వుతూ. బీర్బల్తె లివికి మరోసారి అందరూ ఆశ్చర్యపోయారు. అక్బర్ అయితే 'శభాష్' అని గట్టిగా అభినందించి తన మెడలోని ముత్యాలహారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ పరదేశీయుడు అక్బర్, బీర్బల్ కు నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.