నెరవేరిన కోరిక!
అడవి బాట పక్కన పెద్ద మామిడి చెట్టు విశాలంగా కొమ్మలతో ఉండేది. రకరకాల పక్షులు, జంతువుల కడుపు నింపేది. జీవులు పండ్లను తినగా మిగిలిన టెంకలు మొలకెత్తి మామిడి మొక్కలుగా, చెట్లుగా అయ్యేవి. ఓ టెంక మాత్రం మామిడి చెట్టు మొదలు వద్ద పడి బాధ పడుతోంది.
'అమ్మా.. నన్నూ నీలాగా అందరికీ ఆకలి తీర్చేలా చెయ్యవా? ' అని అది అడిగింది. ఆ మాట విన్న మామిడి చెట్టు బిడ్డా! నా కడుపున నీలాగే ఎందరో పుడుతున్నారు. అందులో పుణ్యాత్ములే భూమి మీద చేరి మొలకెత్తి మానులుగా మారి, నాలాగ ఫలాలు అందరికీ అందించగలరు. నేను నీకు తల్లినే కానీ నిన్ను పెంచలేను' అని ఆవేదన వ్యక్తం చేసింది. ఎండిన మామిడి టెంక ఏమీ అనలేక ఊరుకుంది.కొద్ది రోజుల తర్వాత ఎండలో ఆ దారి వెంట ఓ ముని వెళుతున్నాడు. కాసేపు సేద తీరదామని ఆ చెట్టు నీడన చేరి మామిడి చెట్టు మొదట్లో కూర్చున్నాడు.
చెట్టుకు ఫలాలు లేవు నీడ మాత్రం ఎంతో హాయినిచ్చింది ఎండిన మామిడి టెంక ఆయన పాదాల వద్ద పడి ఉంది. ముని ఆ టెంకను తన చేతిలోకి తీసుకుని ఇది మామిడి వృక్షంగా మారితే ఎన్నోజీవాలకు ఆవాసంగా మారుతుంది. వాటిలో కొన్నింటి ఆకలి కూడా తీరుస్తుంది. ఇలాంటి టెంక ఇక్కడ వృథాగా పడి ఉండటం భావ్యం కాదని, తనతోపాటు ఆశ్రమానికి తీసుకునిపోయాడు. ముని చేసిన పనికి మామిడి చెట్టు ఎంతో సంతోషించింది.
ముని ఆ ఎండిన మామిడి టెంకను తన ఆశ్రమ ఆవరణలో గొయ్యి తీసి పాతి, రోజూ నీరు పోస్తున్నాడు. ఇంతలో వర్షాకాలం ప్రారంభమై బాగా వర్షాలు పడసాగాయి. ముని ఆశ్రమ ప్రాంగణంలో మామిడి టెంక మొలకెత్తి వృక్షంగా ఎదిగింది. మామిడి చెట్టు విస్తారంగా కొమ్మలు, ఆకులతో పచ్చగా కళకళలాడుతోంది. రకరకాల పక్షులు వచ్చి కిలకిలారావాలతో ఆశ్రమం సందడిగా మారింది.
ఆ దేశపు రాజు ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. కానీ ఆయనకు సంతానం లేదని చింత పట్టుకుంది. మహారాజు ఎందరో పండితులు,జ్యోతిష్యులను సంప్రదించినా ఫలితం కనబడలేదు. ఒక రాత్రి నిద్రలో మహారాణికి కల వచ్చింది. ఆ కలలో.. దేవఫలం తింటే.. సంతానం కలుగుతుందని దేవత చెప్పింది. మహారాజుకు దేవఫలం ఎలా ఉంటుందో తెలియక పండితుల్ని సంప్రదించగా.. వారుకావ్యాలన్నీ తిరగేసి మామిడిఫలాన్ని దేవఫలంగా తేల్చారు. కానీ కాలం కాని కాలంలో మామిడి పండు దొరకడం చాలా కష్టమని పండితులు చెప్పారు.
మహారాజు భటులను పంపి రాజ్యం నలుమూలలా గాలించి మామిడి పండు తేవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. మామిడిపండు కోసం వెతకసాగారు. చివరకు అడవిలో ముని ఆశ్రమ ప్రాంగణంలో మామిడి చెట్టు దగ్గరకు వచ్చారు. చెట్టు చివర కొమ్మకు ఒకే ఒక్క ఫలం వేలాడుతూ కనిపించింది. వెంటనే భటులు మునీశ్వరుని అనుమతితో ఆ మామిడి పండుని భద్రంగా కోసి తీసుకు వచ్చి మహారాజుకు అప్పగించారు.
కొద్దినెలల తర్వాత మహారాణి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దేవఫలం ఫలితంగా బిడ్డ పుట్టినందుకు ఆమెకు దేవికగా పేరు పెట్టారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఈ విషయం సైనికుల ద్వారా మునీశ్వరుడికి తెలిసింది. మామిడి చెట్టుకు కూడా తెలిసి చాలా ఆనందించింది.