-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

వెలకట్టలేని ఆస్థి || Priceless property || prudhviinfo

 

వెలకట్టలేని ఆస్థి 


నాపేరు చాముండేశ్వరి. మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. మావారు మార్కెట్ యార్డులో హోల్‌సేల్ వ్యాపారి దగ్గర గుమస్తా. మాకు ఇద్దరు అమ్మాయిలు హారిక, హాసిని. మా అన్నయ్య రాజకీయ నాయకుడు. మా అన్నయ్యకు ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చింది. ఎన్నికల ప్రచారం పగలనక రాత్రనక చేసాము. మా అన్నయ్య ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. అన్నయ్య ఎమ్మెల్యే ఐన తరువాత అన్నయ్యకు వచ్చే లంచాలు ఇతరత్రా ఆదాయాలు మాదగ్గర దాచేవాడు. అలా వచ్చిన సొమ్ముతో మావారు ఉద్యోగం మాని మార్కెట్ యార్డులో ఫైనాన్స్ వ్యాపారం మొదలెట్టారు. మార్కెట్ యార్డులో ఫైనాన్స్ అంటే దూరప్రాంతాల నుంచి రైతులు తీసుకుని వచ్హ్చిన ఆకు కూరలు, కూరగాయలు, పళ్ళు ఒక రేటు పెట్టి కొనేస్తారు. అలా కొన్నవాటికి డబ్బులు వెంటనే ఇచ్చెయ్యాలి. కొన్న సరుకును మార్కెట్ పరిస్థితుల బట్టి అమ్ముతారు, వచ్చే వారం పది రోజులలో రేటు బాగా పెరగవచ్చు అనిపిస్తే ఆకు కూరలు, కూరగాయలు, పళ్ళు కోల్డు స్టోరేజీలో పెట్టి ధర బాగా పెరిగిన తరువాత అమ్ముతారు. ఈవిధంగా చేస్తూ మేము 3 సంవత్సరములు తిరిగేసరికి కోటీశ్వరులం అయ్యాము. మా పెద్దమ్మాయిని ఇంజినీరింగ్ చదివిస్తున్నాము. చిన్నమ్మాయి 10వ తరగతి చదువుతుంది.


మా అన్నయ్యకు వచ్చే ప్రతీ లెక్కలేని ఆదాయం నాచేతికి ఇస్తున్నప్పటికీ మా ఒదిన లెక్క రాసుకుంటుంది. నాకు ఎంత సొమ్ము వస్తుంది తమ అవసరాలకు ఎంత సొమ్ము తీసుకుంటున్నారు ప్రతీదీ లెక్క రాస్తుంది. 


అన్నయ్యకు వస్తున్న ఈసొమ్ముతో ఒక కోల్డుస్టోరేజీ కట్టించాము. మా ఇద్దరు అమ్మాయిల పేరిట రెండు అపార్టుమెంట్ల కాంప్లెక్సులు కట్టించాము. మా చిన్నమ్మాయిని కూడా ఇంజినీరింగ్ లో చేర్చాము.


మా పెద్దమ్మాయి ఇంజినీరింగ్ పూర్తి అయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. ఒక కోటీశ్వరుల కుటుంబానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరుతో మా పెద్దమ్మాయి పెళ్ళి జరిపించాము. పెద్దమ్మాయి పెద్దల్లుడు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు.


చిన్నమ్మాయి తో పాటు ఇంజినీరింగ్ చదువుతున్న ఒక అబ్బాయి పేరు రామనాథ్, అతని తండ్రి వంశపారంపర్య ఆయుర్వేద డాక్టర్. ఆ అబ్బాయికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అబ్బాయి అన్నయ్య ఆయుర్వేదవైద్యంలో డాక్టర్ కోర్సు చేసి తండ్రితోపాటే ఆయుర్వేద వైద్యం చేస్తున్నాడు. చిన్నబ్బాయి ఇంజినీరింగ్ చదువుతున్నప్పటికీ ఆయుర్వేదంలో ప్రవేశం ఉంది. మా చిన్నమ్మాయికి చిన్నప్పటినుంచి మైగ్రెయిన్ తలనెప్పి ఉంది. ఎన్నో మందులు వాడుతున్నాము. ఎందరో డాక్టర్లకు చూపిస్తున్నాము కాని తగ్గటం లేదు. తన క్లాస్‌మేట్ రామనాథ్ ఆయుర్వేదమందు ఒకమారు వాడి చూడమని మా చిన్నమ్మాయికి సలహా ఇచ్చాడట, సరే అంటూ మా చిన్నమ్మాయి వాడిన కొద్ది రోజులకే మా చిన్నమ్మాయికి మైగ్రెయిన్ తలనొప్పి బాధ దూరమయ్యింది. ఆరోజు నుంచి కాలేజీలో విద్యార్థులకు కాని, ఉపాధ్యాయులకు కాని ఇంకెవరికైనా కాని ఏవిధమైన ఆరోగ్య సమస్యలున్నప్పటికీ రామనాథ్ తండ్రి దగ్గరకు అన్నయ్య దగ్గరకు వెళ్ళటం, వారి వారి జబ్బులు నయమవ్వటం జరుగుతున్నాయి. మా చిన్నమ్మాయి హాసిని రామనాథం అంటే ఇష్టపడుతూ చివరకు ప్రేమించటం మొదలెట్టింది.


మా చిన్నమ్మాయికి కూడా ఇంజినీరింగ్ పూర్తికాగానే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. వివాహం జరిపిద్దాము అనుకుంటే రామనాథం ని తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోను అని భీష్మించుకుని కూర్చుంది. రామనాథం ఇంటికి వెళ్ళాము. మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినిఒకరు ఇష్టపడితే మాకు అభ్యంతరం లేదు అని రామనాథం తల్లిదండృలు చెప్పారు. అబ్బాయికి ఆస్థిలో ఎంత వాటా వస్తుంది అని అడిగాము. ఆ ఆస్థి మొత్తం తన తాత ముత్తాతలు సంపాదించినదని, ఆ ఆస్థి ఆయుర్వేద వైద్యానికే గాని తమ స్వంతానికి కాదని, కాబట్టి ఆస్థి మొత్తం తన అన్నయ్యకే చెందుతుందని, తనకు ఒక ఇల్లు మాత్రం వస్తుందని రామనాథం చెప్పాడు. మనం కోటీశ్వరులం, ఇలాంటి కనీసం లక్షలలో కూడా ఆస్థిలేనివానింటికి నిన్ను ఎలా పంపమంటావు? అని నా కూతురుని అడిగాను. అమ్మా! వారికి మనలా ఆస్థిపాస్థులు లేవు కాని వంశపారంపర్యంగా వస్తున్న వెలకట్టలేని ఆయుర్వేద శాస్త్రం వారి ఆస్థిగా ఉంది, అది చాలదా అంది. మా అమ్మాయి కి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరకు మా చిన్నమ్మాయిని రామనాథానికి ఇచ్చి వివాహం జరిపించాము.


వివాహం జరిగిన కొద్ది రోజులకే మా చిన్నమ్మాయి చిన్నల్లుడు కూడా తమ ఉద్యోగాల మీద అమెరికా వెళ్ళిపోయారు. మా చిన్నమ్మాయి నెలతప్పిందని వర్తమానం వచ్చింది. నేను నాశ్రీవారు అమెరికా వెళ్ళాము. ఏడవనెల వచ్చేనాటికి మా చిన్నమ్మాయికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ సంగతి చెప్పిన వెంటనే మా చిన్నమ్మాయి అత్తామామలు అమెరికా వచ్చారు. వారివెంట కొన్ని ఇత్తడి రాగి పాత్రలు తెచ్చారు. 


మా చిన్నమ్మాయి అత్తగారు అన్నము ఇత్తడిపాత్రలో వండుతూ గంజి వార్చుతుంది. అలా వార్చిన గంజిలో ఉప్పు కలిపి మా చిన్నమ్మాయికి ఇస్తుంది. 15 రోజులు తిరిగేసరికి మా చిన్నమ్మాయి ఆరోగ్యం కొద్దిగా కుదుటపడింది అని డాక్టర్లు చెప్పారు. 


మా చిన్నమ్మాయి డెలివరీ సమయానికి తన అత్తమామలు పెడుతున్న తిండి తింటూ, మాత్రలు వేసుకుంటూ ఇతర జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యవంతంగా తయారయ్యింది. డెలివరీ అయ్యింది. పండంటి కొడుకు పుట్టాడు. మా కూతురుకు కొడుకు పుట్టాడు అన్న ఆనందం తీరక మునుపే అమెరికాలో ఏదో సమస్య వచ్చి, చాలామంది ఉద్యోగాలు పోయాయి. మా ఇద్దరు కూతుర్ల మా ఇద్దరు అల్లుల్ల ఉద్యోగాలు కూడా పోయాయి.


మా పెద్దమ్మాయి, పెద్దల్లుడు వారి ఇద్దరు పిల్లలు ఏమి చెయ్యాలా అని సందిగ్ధావస్థలోకి చేరుకున్నారు. భర్తాభార్యలకు మంచి జీతాలు వస్తున్నాయని ఇంటినిండా విలువైనా వస్థువులు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. మా చిన్నమ్మాయి అత్తామామా బెంగపడవద్దు అంటూ సముదాయిస్తున్నారు. 


మా చిన్నమ్మాయి కొడుక్కి అమెరికాలోనే బారసాల జరిపించాము. బారసాలకు వచ్చిన వారికందరికీ మా చిన్నమ్మాయి మామగారు గంజిలో ఉప్పు మిరియాలపొడి కలిపి వేడివేడిగా ఇచ్చారు. అంతా ఇష్టంగా తాగి ఏమిటి ఇది అంటూ ఆరా తీసారు. అది త్రాగితే శక్తి వస్తుందని ఏవిధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మా చిన్నమ్మాయి మామగారు చెప్పగానే ఆ మరునాటి నుంచి రోజూ కొంతమంది మా చిన్నమ్మాయి ఇంటికి వస్తూ గంజి త్రాగటం మొదలెట్టారు. ఒక్కో గ్లాసుకు ఒక డాలర్ చొప్పున వసూలు చేస్తున్నారు.


అజీర్తి వ్యాధి ఉన్నవారికి నేతిలో వెళ్ళుళ్ళి వేయించి అన్నం కలిపి ఇస్తున్నారు. పైత్యం చేసినవారికి అల్లం రసం, ఇలా ప్రతీ వ్యాధికి అందుబాటులో ఉన్న ఆహారంతో వైద్యం చేస్తూ చిన్నమ్మాయి అత్తమామలు సంపాదిస్తూ ఏవిధమైన ఇబ్బంది లేకుండా ఇల్లు గడుపుకొస్తున్నారు. పెద్దమ్మాయికి మాత్రం ఒక సంవత్సరం పాటు మేము ప్రతీనెలా డబ్బు పంపాల్సి వచ్చింది.


సంవత్సరం అయ్యింది. ఈ మధ్యకాలంలో మా చిన్నమ్మాయి అత్తమామలు ఓ మూడు మార్లు అమెరికా ఇండియా ప్రయాణం చేసారు. అమెరికాలో మల్లీ ఉద్యోగాలు వస్తున్నాయి. మా అమ్మాయిలకు అల్లుల్లకు ఉద్యోగాలు వచ్చాయి. మేము కూడా మా చిన్నమ్మాయి అత్తమామలతో పాటు అమెరికా వెళ్ళాము. 


ఎయిర్‌పోర్టుకు మా చిన్నమ్మాయి అత్తమామలను స్వాగతించటానికి చాలా మంది వచ్చారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తరువాత మా చిన్నమ్మాయి అత్తమామలకు అంతా ఇస్తున్న గౌరవం అమోఘం. ప్రతి ఒక్కరూ వచ్చి మా చిన్నమ్మాయి మామగారికి తమ ఆరోగ్య సమస్యలు చెబుతూ తగిన మందు తీసుకుని వెల్తున్నారు. గతంలో మందు తీసుకుని ఆరోగ్యవంతులైనవారు కృతఙ్ఞతా పూర్వకంగా గిఫ్టులు ఇస్తున్నారు.


15 రోజులు గడిచాయి. మా చిన్నమ్మాయి అత్తామామ తిరుగు ప్రయాణమయ్యారు. ఓ రెండు రోజుల తరువాత మా పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాము. మా చిన్నమ్మాయి ఒద్దు అని చెప్పింది, ఎందుకే అని అడిగాను. అక్క బావ ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పటికీ వారికి ముందుకంటే తక్కువ జీతాలు వస్తున్నాయని, వారి ఇల్లు గడవటమే కష్టమౌతుందని, ఇప్పుడు మేము వెల్తే మా పెద్దమ్మాయికి భారమౌతామని చెప్పింది. ఫోన్ లో మా పెద్దమ్మాయితో మాటాడాను, మీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రతినెలా మాకు పంపాల్సిందే అంటూ తన అత్తమామలు ఇబ్బంది పెడుతున్నారని అందుకే ఈపరిస్థితి అని పెద్దమ్మాయి చెప్పింది. పెద్దమ్మాయిని పెద్దల్లున్ని పిల్లలను చిన్నమ్మాయి ఇంటికి పిలిపించి ఓ రెండు రోజులు తరువాత డబ్బులు ఇచ్చి పంపి ఇంకో రెండు రోజులతరువాత ఇండియా తిరిగి బయలుదేరాము.


విమానం బయలుదేరింది. నా ఆలోచనలు నా ఇద్దరి కూతుర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నా పెద్దకూతురుకు కోటీశ్వరుల సంబంధం చేసాను, కాని కష్టకాలంలో కనీస సాయం అందలేదు. నా చిన్నకూతురు ఏరికోరి అతి సామాన్యుల ఇంటి కోడలయ్యింది. నా చిన్నకూతురుకి సమస్య అనగానే తన అత్తమామలు వచ్చి దగ్గరుండి చక్కగా చూసుకున్నారు. ఆర్ధిక సమస్య తలెత్తినప్పుడు తమకున్న విఙ్ఞానంతో అందరికీ దగ్గరయ్యి సమస్యను దూరం చెయ్యటానికి అండగా నిలబడ్డారు. నా చిన్నకూతురు చెప్పిన మాట "వెలకట్టలేని ఆస్థి" ఉన్నవారే నా చిన్నకూతురు అత్తవారు. 


ఇంటికి వెళ్ళిన తరువాత సంక్రాంతికి నా ఇద్దరు కూతుర్లను ఇద్దరు అల్లుల్లను పిల్లలతో సహా రమ్మని కబురు చెయ్యటమే కాకుండా విమానం టిక్కెట్లు కూడా పంపాను. సంక్రాంతికి ఇదివరకే పెద్దల్లుడు మా ఇంటికి వచ్చాడు. చిన్నల్లుడు రావటం ఇదే మొదటిసారి. మనస్పూర్తిగా చిన్నల్లున్ని సత్కరించి పంపాము. చిన్నమ్మాయి అత్తమామలకు కూడా బట్టలు పెట్టాము. పెద్దమ్మాయికి అనవసర ఖర్చులు తగ్గించుకోమని, పొదుపుగా ఇల్లు ఎలా గడపాలో చెప్పి పంపాము. 


ఇద్దరు కూతుర్లు ఇద్దరు అల్లుల్లు వారి పిల్లలు తిరిగి అమెరికా వెళ్ళేటప్పుడు ఎయిర్‌పోర్టులో చిన్నమ్మాయి అత్తామామలు నాతోనూ మావారితోనూ "మీ పెద్దమాయి గురించి చింతించకండి, మీ చిన్నమ్మాయికి కష్టం వస్తే మేము చూసుకున్నట్టే మీ పెద్దమ్మాయికి కష్టం వచ్చినా మేము చూసుకుంటాము, మీరు చింతించకండి" అని చెప్పారు.  


నా చిన్నకూతురు అత్తామామ చెప్పిన ఈ మాటలు విని నా మనసు ఆనందంతో పులకరించింది. నా చిన్నకూతురు చెప్పిన వెలకట్టలేని ఆస్థి అన్న మాట గుర్తుకు రాగా నా చిన్నకూతురును గాఢంగా ఆలింగనం చేసుకుని ఆనందభాష్పాలు రాల్చాను.