అమ్మోరు..మహమ్మారి.. మేము..
నేను భిలై లో పుట్టానంట, నా తరువాత ఓ తమ్ముడు పుట్టి చనిపోయేసరికి, మా నాన్న "నాకు వారసుడు లేడు" నాకు ఈ పని ఎందుకు అని అక్కడ బి యస్ పి లో పని మానేసి మాకు తీసుకొని ఊరికి వచ్చేశాడు, ఇక్కడ మాది ఓ చిన్నపల్లెటూరు, చుట్టుపక్కల తోటలు, కొంతమంది మాలగా వాళ్ళ తోటలొనే ఇల్లుకట్టుకొని ఉన్నారు, ఊరికి రెండు మైళ్ళ దూరంలో మా తోట అందులో మట్టిగోడలు కొబ్బరి చాపలతో ఓ చిన్న ఇల్లు, చుట్టుపక్కల కొండలు కొండలవతల సముద్రం, మాకు ఇక్కడ జీవనాధారం సంవత్సరానికి ఒకసారి వచ్చే జీడీ పంట, ఆ సమయం లొనే ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ జీడీ పళ్ళు పనసపళ్ళు తినడానికి తోటల్లోకి వచెస్తాయ, సీకటి అయితే సరి ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ఉండాల్సిందే.. ఇక్కడ తెలిపిరి ఉండగానే బువ్వతినేసి పడుకుంటాం, కానీకనిపించని ఒలంకిబుడ్డి వెలుగు లో మా ఇల్లు తప్ప అంతా చిమ్మచీకటి... బంటి వచ్చింది అని పెండి మట్టిన సప్పుడు లేకపోతే ఉదయం అడుగులు చూసి తెలుసుకోవడమే తప్ప మాకు ఆ సీకటిలో ఏమి తెలియదు, ఒకసారి పుట్టకూడుకోసం మా ఇంటి గోడ కూడా తవ్వేసింది.. అప్పుడు నేను చిన్న పిల్లని గురుకు గురుకు సప్పుడు తప్ప నేను ఏమి సూడలేదు, సరిగ్గా తెల్లారక ముందే సీకటి సీకటన ఒక్కో తోటనుంచి ఒకరిద్దరు కుండలు తీసుకిని నుయ్యకి వెళ్తాము మగవాళ్ళైతే ఒకసారికి కావిడితో రెండు కుండలు తీసుకొని వచ్చేస్తారు మా ఇంట్లో నేనె మోస్తాను ఒకోసారి మా నడిపిఅక్క వస్తుంది ఏడు ఎనిమిది సార్లు మొస్తే కానీ మాకు నీళ్లు చాలవు.. వానాకాలం అయితే కొబ్బరి చెట్ల కింద పంటిలు, కొంజాము ముందు కుండలు తో నీరు పట్టుకుంటాము, అదే చలికాలం అయితే ఎక్కడి చూసినా ఊటలే, చుట్టుపక్కల కొండలుండడం వలన నీరు ఇక్కడి తోటల నుంచి గడ్డకు, గడ్డ నుంచి సంద్రం లో కలిసిపోతుంది, అయితే ఎండాకాలం మాత్రం మా తోటనుంచి ఓ మైలు దూరం లో ఓ గడ్డ ఉంది ఆ గడ్డనుయ్యనుంచే చుట్టుపక్కల వాళ్లంతా మోస్తరు, ఇరమాట ముమ్మాట నీళ్లు తెచ్చేసరికే తెల్లారిపోతుంది మరో రెండుమూడు బిందెలు మోసి, పోసుకొని ఆఖరి బిందె తీసుకుని ఇంటికి వచ్చేలోగా గంటిఅన్నము లేకపోతే సోడిఅంబలి, సామకూడు ఎదో ఒకటి మా అమ్మ వొండుంటుంది, మాకు ఎదోసారి వరి అన్నం దొరుకుతుంది, వరి అన్నం వండితే ఆరోజు మా ఇంట్లో ఏదో సంబరం లాగే, మాకు మూడు ఆవులు రెండు ఎద్దులు ఉన్నాయి, అవి తినడానికి ఒరిగడ్డి గురించి పల్లం వెళ్తాము, లేదా మా చుట్టుపక్కల పచ్చిగడ్డి కోసుకుని తెస్తాము, మాకు కోళ్లు కూడా ఉన్నాయి ఆవుల కన్నా వీటి తోనే పెద్దబాధ వారానికొకటి నక్క కానీ బౌరుపిల్లి కానీ తీసుకొని వెళ్ళిపోతుంది.. అయినా మా అమ్మ కోళ్లు పెంచడం మానదు, అదేమంటే అమ్మోర్లకి మొక్కు అంటుంది, ఒక కోడి పిల్ల పుడిదే ఏదో చాలు మంకినమ్మ, కొండమహంకాలి, బిడమసండి, ఈ ముగ్గురిలో ఒక అమ్మోరికి మొక్కేసుకుంటుంది, నల్ల కోడి అయితే మాత్రం మరిడి అమ్మొరికి, ఐదు సంవత్సరాల కి ఓసారి ఎండాకాలం లో మా ఊరి సంబరాలు చేస్తారు. మెయ్యగుర్రం, చొట్ట తాత వాలకం దగ్గరే చాలా జనం ఉంటారు, మా పాగడాలు వేస్తే దానిపైన చొట్ట తాత ఆడుకొని వెళ్తాడు, ఆ తరువాత తాత కి మొక్కు కోడి ఇస్తే నోటితో కొరికి ఇసిరెస్తాడు, వీది పొడుగునా కుండలతో పసుపునీల్లు తాత పై పోస్తూ ఉంటారు, సాయంకాలం అమ్మోరికి ఊరి తరుపున ఒక మేక ఎవరి కోళ్లు వారు అమ్మవారికి మొక్కు తీర్చుకుంటారు, మా చుట్టుపక్కల ఏ ఊరికి వెళ్ళాలన్న ఇసక గోర్జు నుంచి నడిచే వెళ్ళాలి ఊరి నుంచి ఓ ఐదు మైళ్ళు వెళితే అక్కడ కంకర రోడ్డు తగులుతుంది, ఎడ్ల బండి మీద పట్నం వెళ్ళడానికి అదే దారి, ప్రతి శుక్రవారం సంత కి గంపలతో పెండ్లం దుంపలు తీసుకొని కొండలు దాటుకొని నడిచి పట్నం చేరే సరికి ఎండ అయిపోతుంది, అవి అక్కడ అమ్మేసి కావలసిన సామాన్లు తీసుకొని వచ్చేస్తాము, ఎక్కడికి వెళ్ళినా బంట్లు భయానికి సీకటిపడేలోగ ఇంటికి చేరుకోవాలి , ఏంటో ఈ ఉద్దానం తో మా జీవితం ముడివేసుకొని పుట్టాము, ఇక్కడి నుంచి ఏ దేశం వెళ్ళినా తిరిగి ఇక్కడికి వచ్చే తనువు చలిస్తారు, మా తాత అంతే బర్మా వెళ్లి చాలా సంవత్సరాలు ఉండిపోయాడు అందరు చనిపోయాడు అనుకున్నారు, ఈలోగా మా అమ్మమ్మ ఏదో జబ్బుతో చనిపోయింది మా ముగ్గురు అమ్మలు అనాదలయ్యారు, దాంతో మా అమ్మ ఇంకా ఇద్దరు చిన్నమ్మలని మా మక్కలతాత పెంచుకున్నాడు, ఈలోగా మా తాత బర్మా నుంచి వచ్చాడు, ఇప్పుడైతే అందరు కాండ్లా, బిలై, కలకత్తా వెళ్లిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే, మా ఊరితో పెనవేసుకున్న బందం అలాంటిది, మా అమ్మ తరం వరకు అంతా బానే ఉంది, అది 1994 వ సంవత్సరం అనుకుంటా నెలకి ఒకరు వాతవ తో పడనిది ఏదో తినేసి కాళ్ళు ఉబ్బిపోయి చనిపోతున్నారు అనుకునేవాళ్లం, కొద్ది సంవ్సరాల కి తెలిసింది అది కిడ్నీ జబ్బు అని, ఇక్కడి నేల గాలి నీరు ఎందులో కలుషితం తెలియదు, ప్రతి గడపకి ఒకరు కిడ్నీ జబ్బు తో చనిపోతున్నారు, ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా, మా బతుకులు మారటం లేదు, ఎందరో వస్తున్నారు పోతున్నారు, అసలు కారణం తెలియటం లేదు, మీ నీళ్ళు విసమైపోయావంటారు, ఇన్నేళ్లుగా తాగుతున్న నుయ్య నీళ్ళు మాని పిల్టర్ నీళ్ళు తాగుతున్నాము, జబ్బు పడ్డాక డయాలసిస్ చేసుకోమని చెబుతున్నారు కానీ జబ్బుకి అసలు కారణం చెప్పి జాగర్తగా ఉండమనటం లేదు, మేము కొలిచే అమ్మవార్లు కి కోళ్లు చాలలేదు అనుకుంటాను, మా తరువాత తరమైన ఈ ప్రాంతంలో ప్రశాంతంగా జీవించాలి, అందుకు ఏవైపు నుంచి ఆసలుకనిపించడం లేదు.. అమ్మ నాన్న ఇద్దరు అక్కలు చనిపోయారు చివరకు మిగిలింది నేనే, ఈ ప్రాంతంతో బంధం విడవలేక ఇంకో దగ్గర బతకలేక ఏదో ఒక రోజు నేను మావాళ్ళ దగ్గరికే... కానీ బృందావనం లాంటి మా ప్రాంతానికి ఈ మహమ్మారి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉంది.