-->

పై చేయి || entry 01 || prudhviinfo

 పై చేయి


    రవి కలవారి అబ్బాయి. ఎప్పుడు అతని వెంట నలుగురు తప్పక ఉండాల్సిందే.

    స్కూల్ కు సెలవు అయినప్పుడు ఉదయాన్నే చక్కగా తయారై నలుగురు స్నేహితులను కలుపుకొని ఊరి మధ్యన ఉన్న కిళ్ళీ షాపు కు వెళ్ళేవాడు.

    "ఎవరెవరికి ఏమి కావాలో చెప్పి తినండి. సోడాలు, కూల్ డ్రింక్స్ త్రాగండి"అనేవాడు రవి.

    స్నేహితులు మొదట్లో అతని అభ్యర్ధన కాదనేవారు. తరువాత తమని డబ్బులు ఇవ్వమని అడగకపోయేసరికి వారు తమకు ఇష్టం వచ్చినవి తినేవారు, త్రాగేవారు.

    తరువాత అక్కడి నుండి ఒక చోట తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుని ఇంటికి వెళ్ళేవారు.అలా కాలేజీ వరకు వారి స్నేహం కొనసాగింది.

   పెద్దయ్యాక వారు కొన్ని దురాలవాట్లకు లోనయ్యారు.ఊరిచివర తెలిసిన వారు ఉంటే వెళ్ళి కల్లు త్రాగారు. రవి"ఇదేందిరా ఇలా ఉంది. మన ఇంట్లో త్రాగే పున్నీళ్లు మాదిరిగా ఉండి, పైగా వాసన వస్తున్నది"అనగానే నలుగురు స్నేహితులు"నిజం రవి. మన లాంటి వారు విస్కీ త్రాగాలి"అన్నారు.

    ఆ తరువాత రోజే వారు వైన్ షాపు కు వెళ్ళి కావాల్సినంత తిని త్రాగారు. ఎవరినీ డబ్బులు ఇవ్వనీయక తానే ఇచ్చాడు రవి.




    "నువ్వు మాకు దేవుడు లాంటి వాడివి. మా అవసరాలు కనిపెట్టి మాకు కావలసినవి సమకూరుస్తావు"అని స్నేహితులు పొగిడేసరికి రవి ఉప్పొంగిపోయేవాడు.

   "ఏదో మాకు సరిపడినంత ఉంది. ఈ ఖర్చు నాకు ఒక లెక్కలోది కాదు"అనేవాడు రవి.

    "అలాంటి పార్టీలు అనేకం జరిగాయి.

    ఎల్లకాలం ఒకేలా ఉండదు. ఓడలు బళ్ళు అవుతాయి. అలాగే రవి ఆస్తులన్నీ కరిగిపోయాయి.

    ఈ లోగా రవి నగరంలో ఒక ఉద్యోగంలో కుదురుకున్నాడు. అయినా పాత అలవాటు మానుకోలేదు. ఊరికి వచ్చినప్పుడల్లా స్నేహితులకు తానే డబ్బు ఖర్చు పెట్టేవాడు.

    ఇలా కాదని రవి తండ్రి అతనికి పెళ్ళి చేశాడు. నగరంలో రవి కాపురం పెట్టాడు.

   నగరానికి స్నేహితులు వస్తే అతని ఇంట్లోనే ఉండేవారు. అతని మంచితనాన్ని వాళ్ళు వాడుకునేవారు.

    వారిలో ఇద్దరు బాగా సంపాదిస్తున్నా రవి కోసం కొంచెం కూడా ఖర్చు పెట్టేవారు కాదు.

    "ఏమండీ వారి కోసం మీరు ఖర్చు పెట్టడం అవసరమా?వారికి లేకనా!"అని భార్య అన్నా రవి పట్టించుకోలేదు.

    "వాళ్ళు నా చిన్నప్పటి స్నేహితులు. వారి కోసం పెట్టె ఖర్చు నాకు ఒక లెక్కలోది కాదు"అనేవాడు రవి.

    ఐదుగురు మిత్రులు కలసి నగరంలో బట్టల వ్యాపారం ప్రారంభించారు.

    రవి వారిని నమ్మి తన భార్య నగలు తాకట్టు పెట్టి ఇచ్చాడు. ఎప్పుడూ నష్టాలే చూపి వారు మాత్రం లాభాలు తమ జేబులో వేసుకునే వారు.

   ఒకరోజు రవి బట్టల కొట్టుకు వచ్చి జమాలెక్కలు చూశాడు. స్నేహితులు చేసిన మోసం తెలుసుకొని వారు వచ్చాక గట్టిగా తన వాటా, లాభం గురించి అడిగాడు.

    ఐదేళ్ళ వాటా, లాభం అతనికి ఇవ్వాలంటే కొట్టు మొత్తాన్ని అతనికి అప్పగించాలి.

    అందుకే"ఇప్పటికిప్పుడు అంత మొత్తం మా వద్ద లేదు. ఒక వారంలోగా నీ సొమ్ము చెల్లిస్తాము"అని వారు నమ్మబలికారు.

    "మీ మాటల మీద నాకు నమ్మకం లేదు. లాభం అక్కరలేదు. నా డబ్బులు నాకివ్వండి."అని వారిని క్షమించి తనది ఎప్పుడూ పైచేయి అని వారికి చెప్పకనే చెప్పాడు.

   స్నేహితుడి ఉదారతను చూసిన వారు అతని వాటా కూడా ఎగనామం పెట్టడానికి తయారుఅయ్యారు.

    "రేపు వస్తే నీ డబ్బు నీకిస్తాం"అని రవిని పంపేసి నలుగురు మిత్రులు ఆలోచించారు.

    చివరికి ఒక పథకాన్ని ఆలోచించి రేపు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

    రవి తరువాత రోజు రాగానే"ఇంతకాలం నువ్వు మాకు నీ డబ్బు ఖర్చుపెట్టావు. మా నుండి పైసా ఆశించలేదు. ఇప్పుడు మాత్రం ఈ డబ్బు ఎందుకు?ఆ డబ్బు మేము నలుగురం పంచుకుంటే ఎంత వస్తుంది?"అన్నారు.

    "నా డబ్బు మీరు పంచుకోవడం ఏమిటి?నా భార్య నగలు అమ్మి ఇచ్చిన డబ్బు అది. ఇస్తే వెళతాను. మళ్ళీ మీ మొఖం కూడా చూడను"అన్నాడు రవి.

    "అయితే నువ్వు ఇంటికి వెళుతూ ఉండు. మేము డబ్బు తీసుకొని మీ ఆవిడ చేతికి డబ్బు ఇస్తాము"అన్నారు వారు.

    "మీరు చెప్పేది నిజమే కదా!ఇందులో ఎలాంటి మోసం లేదు గా"అన్నాడు రవి.

    "నువ్వు దైర్యంగా ఇంటికి వెళ్ళు. మేము పువ్వుల్లో పెట్టి డబ్బు తెస్తాం"అని నమ్మించారు.

    రవి సైకిల్ పై అటు వెళ్ళగానే వీరు మాట్లాడుకున్న లారీ డ్రైవర్ రవికి గుద్ది వెళ్ళిపోయాడు.

    అలా స్నేహితులు తమను నమ్మిన నేస్తాన్ని డబ్బులు ఆడిగాడన్న కోపంతో, మోసంతో అతన్ని చంపించారు.పైగా అతనికి ఇవ్వడమే గాని తీసుకునే అలవాటు లేదని నవ్వుకున్నారు. ఈ విషయంలో ఎప్పటికీ అతనిదే తమకన్నా పైచేయి అని మందు కొడుతూ అనుకున్నారు.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT