సహన సంపద
+++++++++++++++++++++++
ప్రతి మనిషిలో సహజ సిద్ధంగా దైవిక శక్తులు, అసుర శక్తులు ఉంటాయి. ప్రేమ, దయ, కరుణ, ఉదారత, వాత్సల్యం ఇలాంటివన్నీ దైవ శక్తులు, కోపం, అసూయ, ద్వేషం, అసహనం, హింస- ఇవన్నీ రాక్షస గుణాలు. ఈ రెండు రకాల శక్తుల్లో వేటిని మనం పెంచి పోషిస్తే అదే పై చేయి సాధిస్తాయి. మిగిలినవి అణగారిపోతాయి. దైవిక గుణాన్ని పెంపొందించుకుని, శుభ లక్షణాల్ని అలవరచుకునే వ్యక్తుల్లో దైవత్వం దివ్యంగా ప్రకాశిస్తుంది. దైవశక్తుల్లో సహనం ఉత్తమ గుణం. ఇది జీవితంలో ఆపదలు వచ్చిన వేళ కొండంత అండగా నిలుస్తుంది. ఓ వజ్రకవచంలా రక్షిస్తుంది. అసరాగా ఆదుకుంటుంది. మనోనిబ్బరాన్ని అందిస్తుంది. సహనశీలం కలిగిన వ్యక్తులు జీవన వక్రీయవహారంలో ఎదురయ్యే కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు.
ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయాన్ని సాధిస్తారు. సహనం కోల్పోయినవారు గాలి తాకిడికి రెల్లుగడ్డి, చిందర వందర అయినట్టుగా తమ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటారు. అసహనం క్రోధాన్ని కలిగిస్తుంది. క్రోదం వల్ల వివేకం నశిస్తుంది. వివేక రాహిత్యంతో విచక్షణ లోపిస్తుంది. దాంతో వ్యక్తి జీవితానికి చుక్కాని లేని పడవల, తెగిన గాలిపటంలా గమ్యం తెలియని స్థితి దాపురిస్తుంది. కురు రాజ సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నపుడు భీమార్జునాదులు ఆక్రోశంతో క్రోధాన్ని ఆక్ష్మశ్రయించారు. కళ్లముందే అంతటి ఘోర పరాభవం జరుగుతుంటే చూసి సహించలేక విచలితులయ్యారు. కానీ దర్శరాజు, అంతటి విపత్కర పరిస్థితిలో కూడా నిగ్రహం కోల్పోలేదు. పసుఫానుకు ఏ మాత్రం చలించని ఉత్తుంగ శిఖరంలా ధైర్య స్థైర్యాలతో ఓర్చు కనబరచారు. దుర్యోధనుడు ధర్మరాజుకు పూర్తిగా విరుద్ధ ప్రవర్తన ఉన్నవాడు అతను అసహనానికి మారు పేరు ఓర్పు, దయ కరుణ వంటి గుణాలు అతనిలో ఎంతమాత్రం లేవు. పాండవులపై అసహనాన్ని ఆక్రోశాన్ని వెళ్లగక్కి కయ్యానికి కాలుదువ్వాడు. కురుక్షేత్ర సంగ్రామానికి కారకుడయ్యాడు. కురువంశ నాశనానికి అపార జన ధన నష్టానినీ మూలహేతువయ్యాడు.
వరద తాకిడికి మహా వృక్షాలు నేలకొరిగి మళ్లీ లేవలేనట్లుగా సహనాన్ని వీడిన వారు పూర్తిగా చతికిలపడి తమ ఔన్నత్యాన్ని కోల్పోతారు. భర్తృహరి పేర్కొన్నట్లుగా సహన సంపద అనేది మనిషికి ఆత్మ స్థైర్యాన్నీ వివేకాన్నీ వివేచననూ పెంపొందించి, మనిషిని మాననీయుణ్ణి చేస్తుంది. కాబట్టి సహన గుణాన్ని అవలంభిస్తూ జీవన గమనాన్ని మున్ముందుకు కొనసాగించాలి. సహనమనే నౌక మనిషిని క్షేమకరమైన ఒడ్డుకు చేరుస్తుంది. తద్వారా మనశ్శాంతిని చేకూరుస్తుంది.