-->

నేను... నాది.. || TELUGU STORY || prudhviinfo

 నేను... నాది..

ఒక రాజు ఓ జ్ఞాని వద్దకు వెళ్లి.. "నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను" అన్నాడు..


"నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా.." అని అడిగారు ఆ జ్ఞాని..

"మా రాజ్యానికి శత్రు భయం లేదు. దొంగల భయం లేదు. మా రాజ్యంలో పన్నులు తక్కువే. న్యాయ వ్యవస్థ కూడా బాగుంది. ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగదు. ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు. కానీ నాకే ప్రశాంతత లేదు. నేను ఏం చెయ్యాలి" అని రాజు ప్రశ్నించాడు.

"సరే నీ బాధ అర్ధమైంది. నేనొకటి చెప్తాను. అలా చెయ్యి. నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే" అన్నారు జ్ఞాని." అంతకన్నా ఇంకేం కావాలి.. "తీసుకోండి.. ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని" చెప్పాడు రాజు.

"సరే నాకిచ్చావు. నువ్వేం చేస్తావు.." జ్ఞాని అడిగారు. "నేను ఎక్కడికైనా వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను" అన్నాడు రాజు.

"ఎక్కడికో వెళ్ళడం ఎందుకు.. ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చెయ్యవలసిన పనులు చెయ్యి. ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు. చెయ్యగల సమర్దుడివి. ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను" అని చెప్పారు జ్ఞాని. 

ఒక సంవత్సరం గడిచింది. జ్ఞాని రాజుని చూడటానికి వచ్చారు. రాజు మొహంలో ఆనందం కనిపిస్తోంది. ఎక్కడా ఆవ గింజంత దిగులు కనిపించడం లేదు. జ్ఞానిని సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేసి లెక్కలు చూపించాడు రాజు."ఆ లెక్కలు అలా పక్కన పెట్టు గానీ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు" అడిగారు జ్ఞాని. "హాయిగా ఉన్నాను. కావలసినంత ప్రశాంతత అనుకోండి. మునుపెప్పుడు ఇంత హాయిగా లేను. మీకు నా ధన్యవాదాలు" అన్నాడు రాజు.

"సరేగానీ పూర్వం నువ్వు చేసిన పనులకు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏవైనా తేడాలు తెలిసాయా" అని అడిగారు జ్ఞాని. "లేదు.. అప్పుడు చేసే పనులే ఇప్పుడు కూడా చేస్తున్నాను" రాజు సమాధానమిచ్చాడు.

"అప్పుడు ఎందుకు మానసిక ఒత్తిడికి లోనయ్యావు.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదా.." అని జ్ఞాని అడగ్గా రాజు అసలు విషయం తెలిసి జ్ఞాని వంక చూసాడు.

అప్పుడు జ్ఞాని ఇలా అన్నారు...

"అప్పట్లో నువ్వు ఇది నా పని.. నా బాధ్యత.. అని ఆలోచించావు. ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు. నేనిక్కడ కేవలం ఒక ప్రతినిధిని అనుకున్నావు. ఆ మనసే అన్నింటికీ మూలం. నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి. అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు. ఈ దేహం నాది కాదు. ఈ ఊపిరి నాది కాదు. ఇవన్నీ నాకు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు.. అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి. ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు. నీ విధులు నువ్వు సాగించు. నీకు కావలసినంత ప్రశాంతత లభిస్తుంది"...

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT