
meditation

ధ్యానమే అత్యుత్తమం
ధనం సంపాదించడానికి ప్రజలు వారి సకలశక్తులనూ, కాలాన్నీ, మేధస్సునూ, శరీరాన్ని, సర్వస్వాన్నీ ఎలా వెచ్చిస్తారో! ఉదయపు అల్పాహారం తీసుకోవడానికి కూడా వారికి సమయం ఉండడు. తెల్లవారుతూనే పనిచెయ్యడం మొదలు పెడతారు. వారిలో తొంభై శాతం మంది ఆ ప్రయత్నంలోనే మరణిస్తారు. మిగిలినవారు డబ్బు సంపాదించినా, దాన్ని అనుభవించలేరు. ఇదొక అద్భుతమైన విషయం! ధనవంతులవ్వడానికి ప్రయత్నించడాన్ని నేను వ్యతిరేకించను, అది మంచిదే! అభినందనీయమే! కానీ ఎందుకు? అది దేన్ని సూచిస్తోంది? డబ్బు కోసం ఒకరు ఎంత శక్తినీ, శ్రమనీ వెచ్చిస్తున్నారో చూస్తే, స్వేచ్ఛ కోసం కూడా అంత మొత్తాన్నీ మనం వెచ్చించగలమని సూచిస్తోంది. మనం చనిపోయినప్పుడు ఈ డబ్బునూ, మిగిలిన వస్తువులన్నింటినీ కూడా వదలిపెట్టాలని మనకు తెలుసు. కానీ వాటికోసం మనం ఎంతశక్తిని ఖర్చు పెడుతున్నామోచూడండి. కానీ మనుష్యులమైన మనం ఎప్పటికీ సమసిపోనిదాన్నీ, మనతో శాశ్వతంగా ఉండేదాన్ని పొందడం కోసం ఇంతకంటే వెయ్యిరెట్లు ఎక్కువ శ్రమనూ, శక్తినీ వెచ్చించాలి కదా! మన మంచి పనులు, మన ఆధ్యాత్మిక ఉత్కృష్టత - ఇవే మనకు అందరికన్నా గొప్ప స్నేహితులు. మరణం అనంతరం మనల్ని అనుసరించి వచ్చే మిత్రులు. తక్కినవన్నింటినీ శరీరంతో పాటు ఇక్కడే వదలి పెట్టాలి. ఆదర్శాన్ని అందుకోవాలన్న నిజమైన కోరిక -
అదే ఒక గొప్ప తొలిమెట్టు. అది ఉంటే మిగిలినవన్నీ సులభంగా వస్తాయి. దీనిని భారతదేశపు మేధస్సు కనిపెట్టింది. భారతదేశంలోని ప్రజలు సత్యాన్వేషణ కోసం ఎంత కష్టమైనా సహిస్తారు. కానీ ఈ పాశ్చాత్య ప్రపంచంతో (ఆ సమయంలో స్వామీజీ అక్కడున్నారు) వచ్చిన కష్టం ఏమిటంటే, ఇక్కడ ప్రతిదాన్నీ తేలికగా తీసుకుంటారు. సత్యం కంటే కూడా మన ఆధ్యాత్మిక పురోభివృద్ధే ముఖ్యమైన గమ్యం. ఈ అభివృద్ధికై చేసే ప్రయత్నమే ఒక గొప్ప గుణపాఠం. గుర్తుంచుకోండి! ఈ జీవితం మనకి అందించే గొప్ప ప్రయోజనం ఈ పోరాటమే. దానిద్వారానే ముందుకు సాగిపోతాం.
స్వర్గానికి దారి అనేది ఏదైనా ఉంటే అది నరకం ద్వారానే పోతుంది. స్వర్గానికి త్రోవ ఎల్లప్పుడూ నరకం నుంచే! ఎప్పుడైతే ఆత్మ (మనిషి) ఒక ఆదర్శం కోసం పరిస్థితులతో పెనగులాడుతూ మరణిస్తుందో, ఒకసారి కాదు - ఆ మార్గంలో వెయ్యిసార్లు మరణిస్తుందో; కానీ దేనికీ వెరవకుండా మళ్ళీ, మళ్ళీ, ఇంకా మళ్ళీ, ముందుకు పోవడానికి పోరాడుతుందో - అప్పుడు ఆత్మ ఒక బ్రహ్మాండమైన శక్తిగా వెలువడుతుంది.
అంతవరకూ తాను అందుకోవాలని ఆరాటపడుతున్న ఆదర్శాన్ని చూసి అట్టహాసం చేస్తుంది. ఎందుకంటే ఆ ఆదర్శం కంటే తానే ఎంతో గొప్పవాజ్ఞని ఆ ఆత్మ (అంటే మనిషి) తెలుసుకుంటుంది. నేనే అంతాన్ని; నాలోని అంతరాత్మే చిట్టచివరిది; మరేదీ కాదు. నాలోని అంతరాత్మలో పోల్చగలిగేది ఇంకేదైనా ఉందా? నా అంతరాత్మకు ఒక బుట్టెడు బంగారం ఆదర్శం కాగలదా? కానేకాదు. నా అంతరాత్మే నేను కోరగలిగే అత్యున్నత ఆదర్శం. నా నిజతత్త్వాన్ని తెలుసుకోవడమే నా జీవితానికి ఏకైక ఆదర్శం.
![]() |
yoga, meditation |
సంపూర్ణంగా చెడ్డదైనదేదీ లేదు. దేవుడితో పాటు దయ్యానికి ఈ ప్రపంచంలో స్థానం ఉంది; లేకపోతే అది ఇక్కడ ఉండేది కాదు. నేను ఇప్పుడే చెప్పినట్లు, నరకం ద్వారానే మనం స్వర్గానికి వెళ్ళాలి. మన తప్పులకి కూడా ఇక్కడ ఒక స్థానం ఉంది. ముందుకు సాగిపోండి! ఇంతకు ముందు ఏవైనా తప్పులు చేశామని అనుకుంటున్నా సరే, వెనక్కి తిరిగి చూడకండి. ఆ తప్పులే చేయకపోతే, ఇప్పుడున్న ఈ స్థితికి మీరు చేరుకోగలిగేవారని అనుకుంటున్నారా? మీ తప్పులకు కృతజ్ఞులై ఉండండి. అవన్నీ మీకు తెలియని దేవతలు. బాధలకు ధన్యవాదాలు! ఆనందానికీ ధన్యవాదాలు! ఆ రెంటిలో ఏది మీకు ప్రాప్తించినా దాన్ని పట్టించుకోకండి. ఆదర్శాన్ని అంటి పెట్టుకోండి. ముందుకు కదంతొక్కండి! ఈ యుద్ధరంగంలో తప్పుల దుమ్మును రేగనివ్వండి. ఈ దుమ్మును తట్టుకోలేని సున్నితమనస్కులు తమంతట తామే ప్రక్కకు తొలగిపోతారు. కాబట్టి, పోరాడాలనే గొప్ప పట్టుదల, జీవితంలోని చిన్నచిన్న విషయాలకోసం మనం చూపే పట్టుదల, సంకల్పం కంటే వందరెట్లు అధికమైన మహోన్నత సంకల్ప శక్తి ఈ పోరాటానికి కావాలి. మనం వేసే బ్రహ్మాండమైన మొదటి అడుగు ఇదే. ఆపైన, దీనికి తోడుగా, తప్పక ధ్యానం చెయ్యాలి. మనకు అవసరమైనది ధ్యానమొక్కటే. ధ్యానం చెయ్యండి! అత్యుత్తమమైనది ధ్యానమొక్కటే! ధ్యానం చేసే మనస్సు ఒక్కటే ఆధ్యాత్మిక జీవనానికి దగ్గర త్రోవ. దైనందిన జీవితంలోని ఆ ఒక్క సమయంలో మాత్రమే మనం భౌతిక ప్రపంచాన్ని అధిగమించి ఉంటాము సమయంలో ఆత్మ తనలో తానుగా ఉంటుంది. భౌతికమైన వాటన్నింటినుండి విడివడిపోతుంది. అద్భుతమైన ఆ అంతరాత్మ స్పర్శ! పొందుతుంది.
ధ్యానమే అత్యుత్తమం || Meditation is the best || meditation benefits || meditation benefits in Telugu || prudhviinfo