జీవన గమనం
ఆశ..!
ఈ రెండక్షరాల మాట మనిషిని ఎంతగా ఆడిస్తుంది?
ఏ బలహీన క్షణంలోనూ మనసు మారుమూలాల్లో చిగురించే ఆశ, ఒక్కొక్కసారి చింతమానుల ఎదిగిపోయి ఆ మనసును చింతాక్రాంతం చేస్తుంది. మనిషి ఆశా జీవి కావటంలో తప్పులేదు. కాని ఆశ దురాశగా మారినపుడే అది దుఃఖానికి బాట వేస్తుంది. అందుకే మనిషికి ఆశయం ఉండాలే తప్ప ఆశ ఉండకూడదంటారు మహా పురుషులు, పూర్వ జన్మ ఫలాన్ని బట్టి మనకు ప్రాప్తం ఉన్నది లభించక మానదు. ప్రాప్తం లేని దానికోసం ఆశ పడితే, అర్రులు చాస్త అనర్థాలు చుట్టుకుంటాయి, ఆవేదనలు చేపట్టుకుంటాయి. పురాణ కాలంలో బంగారు లేడి కోసం ఆశ పడిన ఆ సీతమ్మ తల్లిని కూడా కష్టాలు కనికరించలేదు. అలాగే, ఆ ధరణీ సుతను, తన అంతఃపుర కాంతగా చేసుకోవాలని ఆశపడిన రావణాసురుడు శ్రీరాముడి బాణానికి బలై పోయాడు. అసలు ఆశలు పెంచుకోవడం అవసరమా? అని కూడా మనము ఆలోచించాలి. పూర్వ జన్మ సుకృతం వల్ల మానవ జన్మ లభిస్తుంది. కాని, భూమి మీద పడిన మరు క్షణమే మరణమనే
గమ్యానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తాం! ప్రతి మనిషి మరణించటానికి జన్మించినపుడు, ఆ మరణం ఏదో ఒకనాడు అనివార్యమైనపుడు - బ్రతికిన కొన్ని రోజులు. ఆ బ్రతుకులో మమకారాన్ని ప్రేమల్ని ఆప్యాయతల్ని పెంచుకోవటం వృధా కాదా? మరణమే యదార్థమైనపుడు బ్రతుకంతా ఓ కలేనా? ఎక్కడో పుడతాం, మరెక్కడో పెరుగుతాం చివరికి ఎక్కడో రాలిపోతాం! ఈ వింత నాటకంలో మనం అందరూ పాత్రధారులు మాత్రమే ? అవసరమైన బొమ్మల పాత్రలను పోషించి తప్పకుంటము.తప్పదు, అనంతో కోటి విశ్వంలో ఎన్నో జన్మల పరిణామంలో ఈ మానవ జన్మ ఎన్ని క్షణాలు"? ఈ కొన్ని క్షణాల్లో ఇంతటి ఆత్మీయతలు? ఎన్ని వేల అనుబంధాలు? ఈ జన్మలో నవ మాసాలూ మోసి, కండ్లలో పెట్టుకుని పెంచే దైవ సమానురాలైన తల్లి - మరు జన్మలో మనకేమవుతుంది?
అసలు ఏమిటి మానవ జన్మ?
ఒకరి చేయి మరొకరు పుచ్చుకొని ఏడడుగులు ఒకరితో ఒకరు నడచి - జన్మ జన్మలకైనా "నాకు నువ్వు - నీకు నేను" అనుకునే దంపతులు మళ్ళీ జన్మలో ఎవరికి ఏమవుతారు? ఈ ప్రశ్నలన్నీ మనకు మనమే వేసుకుని - జవాబుల్ని రాబుట్టుకుంటే ఆశ అనే మాయపొర మన మనసుల్ని తొలగిపోతుంది. మనం ఓ మనిషి దగ్గర అప్పు తీసుకున్నామనుకోండి. దాన్ని తీర్చే వరకు ఆ మనిషి మనచుట్టూ తిరుగుతుంటాడు. ఆ అప్పు తీర్చటానికి మనం కూడా. అనుక్షణం తాపత్రయ పడుతుంటాము. తీర్చేదాకా మనస్థిమితానికి దూరం అవుతాం. అది కాస్త తీరి పోయాక హాయిగా ఊపిరి పీల్చుకుంటాం. ఆ అప్పిచ్చిన మనిషి మన దారి కాయటం మానేస్తాడు. మనం కూడా క్రమేపి అతణ్ని మరచిపోతాం!
బంధాలు, బంధుత్వాలు కూడా అంతే. ఇవన్నీ కూడా ఓ రకంగా అప్పులే "రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ" అన్నారండుకే ఈ రుణాలు తీరిపోతే అంతా ప్రశాంతతే. ఈ మాత్రం దానికి ఆశలు పెంచుకోవటం దేనికి? ఆ గుర్రాల వెంట పరుగులు తీయటం దేనికి? అందుకే... ఆశ పడతాం! అంతే ఆశల్ని దురాశలుగా మార్చుకొని అవి తీరకపోతే నిరాశకు లోనై జీవన ప్రయాణాన్ని ప్రమాద భరితంగా చేసుకోవద్దు!.
జీవన గమనం || prudhviinfo