![]() |
soul |
ఆత్మ సర్వాంతర్యామి
శిష్యుడు: ఆత్మ అన్నింటిలోనూ ఉండే సర్వాంతర్యామి. అన్ని జీవుల ప్రాణాలకే ప్రాణం. మనకు ఎంతో చేరువలో ఉంది. అయినా దాన్ని మనం గ్రహించడం లేదు! ఎందుకు? స్వామీజీ: మీకు కళ్ళున్నాయో లేవో మీరే చూసుకోగలరా? తోటివారు కళ్ళను గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మనకు కూడా కళ్ళు ఉన్నాయన్న విషయం మనకు గుర్తుకు వస్తుంది. మళ్ళీ మన కళ్ళలో దుమ్ము, ఇసుక పడినప్పుడు కూడా కళ్ళు గుర్తుకు వస్తాయి. నొప్పి కలగడంవల్ల మనకు కళ్ళు అనేవి ఉన్నాయన్న విషయం బాగా తెలిసివస్తుంది. అదే విధంగా, మన హృదంతరాళాలలో ఉన్న, విశ్వజనీనమైన ఆత్మ యొక్క ఉనికిని అంత సులువుగా గ్రహించలేము. శాస్త్రాలను చదవడం ద్వారా, ఒక గురువు బోధలను వినడం ద్వారా మనకు కొంత అవగాహన ఏర్పడవచ్చు.
కానీ ప్రపంచంలోని దుఃఖంతో నిండిన చేదు అనుభవాలు మనిషిని గాయపరచినప్పుడు, తనకు బాగా సన్నిహితులు, బంధువులు మరణించినప్పుడు, మనిషి తాను నిస్సహాయుణ్ణని అనుకుంటాడు. తానేమైపోతానో అన్న ఆలోచనతో చొరరాని, దాటరాని చీకట్లు మనస్సును మథిస్తున్నప్పుడు ఆత్మ సాక్షాత్కారం కోసం మనిషి పరితపిస్తాడు. కాబట్టి దుఃఖం ఆత్మ సాక్షాత్కారానికి సహాయం చేస్తుంది. కానీ ఆ చేదు అనుభవాలను మనిషి జ్ఞాపకం పెట్టుకోవాలి. కుక్కలు, పిల్లులులాగా కష్టాలను కేవలం అనుభవించి ఏమీ నేర్చుకోకుండానే చనిపోయేవారు మనుష్యులా? సుఖదుఃఖాలు ఎదురైనప్పటికీ, విచక్షణ చేస్తూ, అవి త్వరలోనే సమసిపోతాయని చక్కగా గ్రహించే మనిషి గొప్ప భావావేశంతో ఆత్మపట్ల భక్తి పెంచుకుంటాడు. అటువంటి వాడే మనిషి. మనుష్యులకూ, జంతువులకూ ఇదే తేడా. ఏదైతే మనకు అత్యంత సన్నిహితంగా ఉంటుందో దాన్ని మనం అంత తక్కువగా గమనిస్తాం. ఆత్మ మనకు దగ్గరగా ఉండే వాటన్నింటికంటే కూడా అతిదగ్గరగా ఉంటుంది. అందుచేతనే నిర్లక్ష్యంగా, నిలకడ లేకుండా ఉండే మనిషి యొక్క మనస్సు దాన్ని కనిపెట్టలేకపోతుంది.
కానీ ఏ మనిషి అయితే మెలకువతో ఉంటాడో, ప్రశాంతంగా ఉంటూ తనను తాను స్వాధీనంలో ఉంచుకుంటాడో, అటువంటివాడు మంచిచెడులను విచక్షణ చేస్తూ బయటి ప్రపంచాన్ని లెక్కచెయ్యకుండా తన లోపలే ఉన్న ప్రపంచంలోనికి ఇంకాయింకా లోతులకు మునిగి, ఆత్మ యొక్క మహత్త్వాన్ని తెలుసుకుని, గొప్పవాడవుతాడు. అప్పుడు మాత్రమే మనిషి ఆత్మజ్ఞానాన్ని పొంది, “అహం బ్రహ్మాస్మి" (నేనే ఆత్మను), “తత్త్వమసి, ఓ శ్వేతకేతూ!" (నీవే ఆ ఆత్మవు! ఓ శ్వేతకేతూ!) మొదలైన శాస్త్రవాక్యాలలోని సత్యాన్ని సాక్షాత్కరించుకోగలుగుతాడు. మీకు అర్థమయిందా? శిష్యుడు: అర్థమయిందండి. కానీ జ్ఞానోదయానికి బాధలు, కష్టాల బాటలో ఎందుకు పయనించాలి? దీనికంటే అసలు సృష్టి లేకుండా ఉంటే బాగుండేది. మనందరం ఆ బ్రహ్మంతో ఒకప్పుడు ఐక్యమయి ఉన్నాం. మరి అలాంటప్పుడు బ్రహ్మాన్ని చేరే త్రోవలో సృష్టి కోసం ఈ కోరిక ఎందుకు? జీవుడు బ్రహ్మం కంటే వేరు కాకపోయినా, చావు పుట్టుకల బాటలో పయనిస్తూ, జీవితంలోని ద్వైతభావనలతో ప్రభావితుడవుతూ, ముందుకు సాగడం ఎందుకు? స్వామీజీ: ఒక మనిషి మత్తులో ఉన్నప్పుడు అతడికి అనేక భ్రాంతులు కలుగుతాయి. కానీ ఎప్పుడైతే ఆ మత్తు దిగిపోతుందో అప్పుడు వాటన్నింటినీ మత్తువల్ల వేడెక్కిన తన మెదడులో కలిగిన భ్రమలుగా తెలుసుకుంటాడు. మొదలు ఏదో తెలియని ఈ సృష్టిలో ఏదో ఒకనాడు అంతమైపోయే విషయాలు ఏవైతే మీకు కనిపిస్తాయో అవన్నీ మీ మైకం వల్ల (అంటే వివేక విచక్షణలు లేని మనస్సు వల్ల) కనిపించేవే. ఆ మైకం దిగిపోయినప్పుడు ఇటువంటి ప్రశ్నలు ఉదయించవు.
ఆత్మ సర్వాంతర్యామి || The soul is omnipresent || the soul is omnipresent in telugu || prudhviinfo