![]() |
Tamasoma Jyotirgamaya |
తమసోమా జ్యోతిర్గమయ
చీకట్లో ఉంటే ఎంతటి విలువైన వస్తువైనా కంటికి కనిపించదు. కాంతి ప్రసరించడం వల్ల లౌకిక ప్రపంచంలోని వస్తువు ఉనికి వెల్లడవుతుంది. విలువ అవగతమవుతుంది. స్వస్థత చేకూర్చే వనమూలికలు, ఆహ్లాదపరచే అరుదైన పుష్పాలు, వివిధ జీవజాతులు, అబ్బురపరచే జలపాతాలు... కారడవిలో ఉంటే, చీకట్లో ఉన్నట్టే. వాటిపై ప్రపంచం కన్ను పడదు. ఎవరో ఒక సాహసికుడు ధైర్యం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి ముందడుగేస్తే, ఆ ప్రాంతం వెలుగులోకి వచ్చి, అమూల్య సంపద జనానికి చేరువవుతుంది.
అక్కడి మూలికలతో వ్యాధులు నెమ్మదిస్తాయి. ప్రాణం నిలబడుతుంది. ఆ స్థలం పర్యాటక ప్రాంతమై జనాన్ని అలరిస్తుంది. మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. కొమ్మన విరిసి సువాసనలీనుతున్న పూవును చూసి మైమరచే వారొకరైతే, భగవంతుడికి సమర్పించి భక్తి చాటుకొనేదొకరు. అత్తరు తయారీకి ఉపయోగించి సువాసనలు పంచేది మరొకరు, పుస్తకంలోని పుటల మధ్య మధుర స్మృతిగా దాచుకొనేది. ఇంకొకరు. కొప్పున ముడుచుకొని అందాన్ని అద్దంలో చూసి సిగ్గుల మొగ్గవుతుందో అతివ. ఇలా ఒకే పువ్వు భిన్న ఆలోచనలకు కారకమవుతుంది. సృష్టి చాలా చిత్రమైంది. ఎన్ని కనుక్కొన్నా, తెలుసుకొన్నా... ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ప్రకృతి అంతులేని మానవుడు అవిశ్రాంతంగా సమాధానం వెతికే నిరంతర అన్వేషి, ప్రకృతి నుంచి ఎదురయ్యే ప్రతి సవాలును స్వీకరించి, విజయం పొందడానికి మనిషి చేసే కృషిలో వ్యక్తిగత ఆనందం, ఆహ్లాదం అంతర్లీనమై ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి గతంలో లేవు.
భవిష్యత్తులో ఉండకపోవచ్చు. వర్తమానమే సంతోషదాయకం అన్నది వాస్తవం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే నర్మగర్భంగా, కనిపించేదంతా మాయ అన్నారు. లోకం తీరును ఎరిగిన అనుభవజ్ఞులు. మానవుడు కాంతిలో కనిపించే ప్రతిదాన్నీ చేజిక్కించుకోవాలని ఆరాటపడతాడు. అందితే అతడి ఆనందం వర్ణనాతీతం. లేకుంటే అనంతమైన చింత. చీకటి మానసిక ప్రశాంతతకు చిహ్నం. అది మానవుడు సేదదీరే అమూల్య సమయం. కనిపించి, ఆకర్షించి, కవ్వించేవి ఉండవు కాబట్టి ఎండమావుల వెంట పరుగు ఆపి. నిద్రలో ప్రశాంతత పొందుతాడు. కమ్మని కలల ఊయల్లో తాను ఎరుగని లోకాలను దర్శిస్తాడు. సృష్టికర్త భగవంతుడని భావించే భక్తుడు, ప్రతి అణువులో అంతర్యామిని దర్శించి పులకించిపోతాడు. మానవజన్మ పరమార్ధం ఆదేనని మురిసిపోతాడు. కళ్లకు కనిపించే కృత్రిమ రూపకల్పనలకు విలువివ్వడు. బయటి ప్రపంచంలోని వెలుగుతో, వస్తువులను చూడటం అనవసరం అనుకొంటాడు. భగవంతుణ్ని దర్శించి తీరాలన్న అంతులేని ఆర్తితో, కాంక్షతో, ఏకాంత సాధనతో, ధ్యానంతో అంతరంగంలోని చీకట్లను పటాపంచలు చేసుకొని, నిశ్చల జ్ఞానజ్యోతిని మనసున నిలుపుకొని, అతీంద్రియ దృష్టితో అలౌకికాన్ని వీక్షించగలుగుతాడు.
అంతరంగంలో సత్యం, నిత్యం అయిన ఆత్మ, అంతరాత్మల లయంతో ఉన్నత స్థాయి పారవశ్యం పొందుతాడు. సూర్యుడి నుంచి పొందే వెలుగు, జగతి చైతన్యానికి అవసరం. మనిషి అంతరంగాన తనంతట తానుగా వెలుగులు చిందే జ్యోతి ఆధ్యాత్మిక పరిపక్వతకు నిదర్శనం. ముక్తి అంటే అగోచరం, ఆగమ్యం కాదు. నిర్మలమైన మనసు, ఆత్మగా పొందే అనిర్వచనీయమైన స్థితి. తమసోమా జ్యోతిర్గమయ అని వేదవేత్తలు ఉపదేశించింది ఇదే. మానవులకు మార్గం చూపిన రుషుల కోవ ఇది. చీకటినుంచి వెలుగుకు మళ్ళించే నిజమైన రుజుమార్గమిది!
తమసోమా జ్యోతిర్గమయ || Tamasoma Jyotirgamaya || prudhviinfo