మనతో సహా సాధారణంగా ప్రతి జీవీ నిద్రిస్తుంది కదా, అసలెందుకు నిద్ర వస్తుంది?
శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి నిద్ర ఎంతో దోహద పడుతుంది. నిద్రపోతున్నప్పుడు గుండె కొట్టుకోవడం, శ్వాసించడంలాంటి ప్రక్రియలు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. మేలుకొన్నప్పుడు కోల్పోయిన శక్తిని నిద్రిస్తున్నప్పుడు శరీరం పుంజుకుంటుంది. అలాగే నిద్రస్తున్నప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తూ మెలుకొన్నప్పటి అనుభవాలను పదిలపరచడం, అనవసరమైన సమాచారాన్ని తుడిచివేయడం లాంటి చర్యల్లో నిమగ్నమవుతుంది. శరీరంలో ఉండే గడియారంలాంటి వ్యవస్థ మనకు కలిగే అలసటను, దాన్ని పోగొట్టుకోడానికి ఎంతకాలం విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని నియంత్రించి మెదడు, నాడీ సంబంధిత ప్రసారాలు విడుదలయ్యేటట్టు చేయడంతో నిద్ర ముంచుకువస్తుంది. అలాగే పినియల్ గ్రంధులు (pineal glands) రాత్రివేళల్లో ఉత్పన్నమయ్యే నిద్రసంబంధిత మెలటోనిన్ అనే హార్మోన్లను విడుదల చేయడం వల్ల రాత్రివేళ చీకటిలో ఎక్కువ సమయం నిద్ర వస్తుంది. ఎవరెంతసేపు నిద్రపోతారనేది జన్యు సంబంధిత విషయం. రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రించడం ఆరోగ్యకరమైన అలవాటు.