-->

ఏది శాశ్వతం......

 

ఏది శాశ్వతం......


మనిషి జీవిస్తున్నప్పుడే నేర్చుకోవాలి. నేర్చుకుంటూ జీవించాలి. బతకడం జీవించడం కోసమే కాదు. జ్ఞాన సముపార్జన కోసం కూడా. జీవిస్తూ ఏం నేర్చుకుంటున్నాం అన్నది ముఖ్యం.


మనల్ని అతి వేగంగా ఆకర్షించేవి అజ్ఞానం, మోహం. ఆ రెండింటినీ తప్పించుకుని ముందుకు వెళ్తేనే జ్ఞానోదయం అవుతుంది.

ఈ లోకంలో శాశ్వతమైనది ఏదనే విషయం ముందు తెలుసుకోవాలి. శాశ్వతమైనది తెలిస్తే మనల్ని ఎప్పట్నుంచో వెంటాడుతున్న మరణ భయం తొలగిపోతుంది. శాశ్వతమైనది తెలిస్తే ఏది అశాశ్వతమైనదో కూడా తెలుస్తుంది. ఈ రెండింటినీ పూర్తి అనుభూతిలోకి తెచ్చుకున్నవాడే నిజమైన మానవుడు. అతడే జ్ఞాని. అతడే యోగి. శ్రీకృష్ణుడు భగవద్గీత లో చెప్పిన ఉత్తమమైన యోగి అతడే.


శాశ్వతంగా ఉండేది ఏదీ కళ్లకు కనిపించదు. అంతా అశాశ్వతంగా అనిపిస్తుంది. ఈవేళ ఉండి రేపు కనిపించకుండా పోయేవి ఎన్నో. మరి శాశ్వతంగా ఉండేది మనకు ఎలా తెలుస్తుంది?


 శాశ్వతంగా ఉండేది ఆత్మ. అది నీలోనే ఉంది. నువ్వు పుడతావు, మరణిస్తావు. కాని నీ ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఎవరూ చంపలేరు. 


ఇది తెలుసుకుని జీవించేవాడే తనకు ఆప్తుడని పరమాత్మ భగవద్గీతలో విశదీకరించాడు.

దీన్ని ఎలా నమ్మాలి? అర్జునుడికి చాలా సందేహాలు కలిగాయి. నమ్మకం కుదరలేదు. కాని చెప్పినవాడు శ్రీకృష్ణుడు. ఏం చెయ్యాలి?


 చూస్తేనే గాని నమ్మదు మనసు. ఆత్మను మామూలు కళ్లతో చూసే అవకాశం లేదు. అది జ్ఞానంతోనే చూడగలం. అటువంటి జ్ఞాననేత్రం కావాలి. అది అందరికీ ఉంటుంది. కాని, మూసుకుని ఉంటుంది. దాన్ని తెరిపించాడు శ్రీకృష్ణుడు.

ఈ భూమ్మీదకు మనం వచ్చింది రెండు విషయాలు తెలుసుకోవడానికి. ఒకటి శాశ్వతమైనదాని గురించి, రెండోది అశాశ్వతమైనదాని గురించి. ఈ రెండూ తెలిస్తే సర్వమూ తెలిసినట్లే. శాశ్వతమైనది ఆత్మ. అశాశ్వతమైనది శరీరం. ఆత్మ కనిపించదు. శరీరం కనిపిస్తుంది. కనిపించనిది ఎప్పుడూ ఉండేది. కనిపించేది ఎప్పుడూ ఉండనిది. అదే గమ్మత్తు!


జీవించడానికి తిండి, నిద్ర, గాలితోపాటు శుద్ధ జ్ఞానం కూడా కావాలి. ఏ కాలుష్యం లేని అసలు సిసలైన సత్యస్వరూప జ్ఞానం వల్లనే ఆత్మ ఉనికి తెలుస్తుంది. ఆత్మ తెలిస్తే, ఇక రెండోది తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. శాశ్వతమైన ఆత్మలో జగత్తు ఉంది. ఆత్మకు పూచిన పువ్వు వంటిది ఈ ప్రపంచం. ఆత్మాన్వేషణే జీవితం. తెలిసో తెలియకో ప్రతి ఒక్కరూ చేసే పని తమ ఆత్మను తాము వెదుక్కోవడమే. ఇదే బతుకు!శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం ఉపకరణం, ఉపాధి. దీన్ని ఆధారం చేసుకునే ఆత్మను చేరుకోవాలి.

శరీరం నేను కాదు. ఈ శరీరంలో నేను నివసిస్తున్నాను. అశాశ్వతమైన దానిలో శాశ్వతమైనవాడు ఉంటున్నాడు. వాడు సర్వ జీవుల్లో ఉంటున్నాడని తెలుసుకోవాలి.


ఎవరైతే మానవసేవను మాధవసేవగా భావిస్తారో, వారు శరీరాన్ని పరులకోసం వినియోగిస్తారు. 


పరోపకారమే పరమార్థంగా భావిస్తారు. శాశ్వతమైన ఆత్మకోసం అశాశ్వతమైనదాన్ని తృణప్రాయంగా భావిస్తారు. అటువంటివారే లోకానికి ఆదర్శప్రాయులై వెలుగొందుతారు!


ఓం నమో నారాయణాయ🙏

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT