పొగడ్తలు ఎన్ని రకములు అవి ఏవి ?
......................................................
(1)పొగడ్తలు ఎన్ని రకములు అవి ఏవి ?
పొగడ్తలు మూడు రకములు. అవి (1) స్వ (2) పర (3) స్వపర.
(2) పొగడ్తలు మూడు రకములని నిర్వచించినదెవరు ?
జగన్నాథపండితరాయలు. తెలుగువాడు. కాశీలో సంస్కృతాన్ని చదువుకొన్న గొప్పవాడు. డిల్లీలోని షాజహాను కొలువు కూటంలో సంస్కృతాంధ్ర పండితుడు.
(3) పొగడ్తల గురించి జగన్నాథపండితుడు ఏ విధంగా వివరించాడు.
(శ్లో)
వానరాణాం వివాహేషు
తత్రగార్దభ గాయకాః
పరస్పరం ప్రశంసంతి
అహోరూప మహోధ్వనిః
ఒకానొక అడవిలో కోతుల వివాహం జరుగుతోంది.
ఈ పెండ్లిలో పాటలు వినిపించటానికి,సంగీతం అలాపించటానికి గాడిదలు వచ్చాయి.
కోతులది అద్భుతమైన సౌందర్యమని గాడిదలు, గాడిదలకంఠం శ్రావ్యంగా వుందని వీటి సంగీతం వింటుంటే వళ్ళు పులకరించిపోతోందని కోతులు పొగడుకున్నాయి.
(1) స్వ లేదా స్వంత పొగడ్తలు.వీటినే మనం స్వంత డబ్బావాయించడం, గొప్పలు చెప్పుకోవడం, కోతలు కోయడం. గప్పాలు కొట్టడం, తన గురించి అతిశయోక్తులుగా చెప్పడం, స్వోత్కర్షలు వగైరాలు చెప్పడమంటారు.
నేను వీరుడిని శూరుడిని వడ్ల సుబ్బక్క మేనల్లుడిని, నాకు కోటలుకొండలు మడులు మాణిక్యాలున్నాయని సొరకాయ కోతలు కోస్తారు.
స్వంత డబ్బా కొట్టడం అనేది ఎదుటివ్యక్తి నమ్మేంత వరకే.నమ్మకంపోయిందా ఇక అంతేసంగతులు. ఇలాంటివారిని ఇక ఎప్పటికి ఎవరు నమ్మరు.
(2) ఇక రెండవది, అతి ప్రమాదకరమైనది పర అంటే ఎదుటి వ్యక్తిని పొగడటం. దీంట్లో కొందరు కార్యసాధకులుంటారు.ఎదుటి వ్యక్తిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను పొగిడి, వారు ఉబ్బిపోగానే తమ పనులు కానిచ్చేసుకొంటారు.
పనిలోపనిగా ఇలా పొగిడేవారు చాడీలు చెప్పడం చేస్తారు.వీరిని చెంచాగాళ్ళని కూడా అనుకోవచ్చును.
పొగడటం కొందరికి అవసరమైతే మరికొందరికి బలహీనత. ఇలాంటి బలహీనతలకు లోనైతే అంతరాలు పెరగడం జరుగుతుంది.
గతంలో ఇలా పొగిడించుకొనేందుకు రాజులు, మహరాజులు, అమరనాయకులు, మహమండలేశ్వరులు జమిందారులు తమ కొలువుకూటంలో కొందరిని నియమించుకొనేవారు. వారే వందమాగధులు, బట్రాజులు.
మహరాజాధిరాజ పరమేశ్వర రాజగంభీర రాజకులతిలక ఆర్తజనపోషక అరివీర భయంకర రిపుమర్ధక వైరి దుర్జయ పరనారీదూర కవిపండిత పోషక కొండవీడు కొండపల్లి వినుకొండ దుర్గసాధక శత్రుతలగొండ గండ గండరగండ సర్వరాజన్య కీరిటహర జయహో జయహో అంటూ దండకవిలెలు చెప్పేవారు.
వందమాగధులకు బట్రాజులకు జీతంతోపాటు వృత్తి మాన్యాలు దక్కేవి.
(3) ఇక మూడవది స్వపర అంటే ఒకరికొకరు పరస్పరం పొగుడుకోవడం. అన్నా నీవల్లె నేను గెలిచాను, నీకు సర్వధా కృతజ్ఞుడినని ఒకడంటే ఆ నాదేముంది తమ్ముడు నీ మంచితనం నీ చతురత నీ వ్యూహం గొప్పది, నేను చేయందించానంతే, నువ్వు అల్లుకుపోయావంటూ ఎదురు పొగడ్త చేస్తారు.
ఇలా ఒకరికొకరు పరస్పరం ఎదురురెదురుగా పొగడుకొన్న ఇలాంటి వారు చాటుకు వెళ్ళి తిట్టుకోవడం, గోతులు తీయడం ఖాయం.
మీరు ముత్యాల ముగ్గు సినిమాను చూసేవుంటారు కదా! ఇందులో ప్రతినాయకుడైన రావుగోపాలరావును ఎవరైనా పొగిడితే పక్కనున్న ఇద్దరు తాళం వేస్తూ మద్దెల వాయించేవారు కదా.
చివరగా చెప్పొచ్చేదేమిటంటే *గతంలో వందమాగధులు బట్రాజులు చేసేపనిని ఇప్పుడు కొందరు అధికారులు చేస్తున్నరంతే.